Sri Ram Sagar Project Water Levels Dead Storage : ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు సాగు,తాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశాజనకంగా ఉంది. నాలుగేళ్ల సరళి చూస్తే ఈ ఏడు ప్రాజెక్టు చరిత్రలో కనిష్ఠానికి నీటిమట్టం చేరింది. ఎగువన వర్షాలు బాగా పడితే జులైలో వరద ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో కేవలం 9 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు తాగునీరు అందిస్తున్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథకు నిత్యం 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎండల తీవ్రతకు నిత్యం 275 క్యూసెక్కులు ఆవిరవుతోంది. ఈ లెక్కన భగీరథకు ఒకటిన్నర నుంచి 2 టీఎంసీల నీరు అందించాలి. అలాగే ఆవిరి రూపంలో మరో రెండు టీఎంసీలు నష్టపోతోంది. వర్షాభావం పరిస్థితి ఇలాగే సాగితే నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోతందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Water Crisis In SRSP Canal : ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 కాగా ప్రస్తుతం 1055 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా 9 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టులో నీరు తగ్గడం వల్ల జలాశయంలోని చేపలు మృతి చెందడంపై మత్స్యకారులు కలత చెందుతున్నారు. జీవనోపాధి కోల్పొతున్నామని ఆవేదన చెందుతున్నారు. జూలై వరకు తాగునీటికి ఇబ్బంది లేదని రుతుపవనాలు తొందరగా వచ్చే అవకాశం ఉందన్న వాతావరణశాఖ అంచనాలతో పంటలకు సాగునీరు ఢోకా ఉండదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభం కంటే ముందుగానే వర్షాలు పడి ఎస్సారెస్పీలో నీరు చేరాలని తద్వారా పంటలకు సరిపడా నీళ్లు ఉండాలని ఆయకట్టు రైతులు కోరుకుంటున్నారు.
కాళేశ్వరం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నిరంతరం ఎస్సారెస్పీ వరద కాలువలో నీరు నిల్వ ఉండే విధంగా గత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ మేడిగడ్డ పియర్లు కుంగిపోవడంతో పరిస్థితి తల కిందులైంది. నీరు ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది. ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద కాల్వపై ఆధారపడి పంటలు వేసిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
నీటి సంక్షోభానికి తప్పదు భారీ మూల్యం - అందుకు పొదుపే కావాలి ఓ పాఠం! - Water Crisis in India
వర్షపు నీటిని ఒడిసిపడదాం.. కరవు నుంచి బయటపడదాం - RAIN WATER HARVESTING IN HYDERABAD