Central Minister Pemmasani Chandrasekhar: తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి, గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని అమెరికాలో స్థిరపడి, వైద్యరంగంలో ఉన్నతస్థానాలకు ఎదిగారు. సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో, రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని.. తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది.. కేంద్ర క్యాబినెట్‌లో చోటు సంపాదించారు.
ఈ ఎన్నికల ముందే, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన ఆనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం..'యు వరల్డ్' ఆన్‌లైన్ సంస్థను ప్రారంభించి.., స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించారు. ఆ తర్వాత ఈ సంస్థ..వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్ శిక్షణ ఇస్తూ అతికొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం... రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం.. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో... ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.
మోదీ జట్టులో ఏపీ నుంచి ముగ్గురు- కేంద్ర మంత్రివర్గంలోకి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మ - modi new cabinet
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్.. తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. ఎంబీబీఎస్ (MBBS), ఎండీ పూర్తిచేసిన చంద్రశేఖర్ వయసు 47 ఏళ్లు. భార్య డాక్టర్ శ్రీరత్న. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు చిరపరిచితులు. చంద్రశేఖర్.. ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి... ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీజీ చదవడం కోసం అమెరికా వెళ్లిన ఆయన.. అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో..వసతి, శిక్షణ కోసం అధిక వ్యయం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు.
అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. తొలి నుంచి తెలుగుదేశంతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్... ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖారరైనప్పటికీ, అప్పటి రాజకీయ పరిణామాల నడుమ రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగారు. దీంతో ఆ ఎన్నికల్లో రాయపాటి పోటీలో నిలిచారు.
రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్రమంత్రి వర్గంలో చోటు! - Narasapuram MP Srinivas varma