Special Story On Nizamabad Teacher : ఉన్నస్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి చేర్చే దైవమే ఉపాధ్యాయుడు. విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే కాకుండా తనకున్న విజ్ఞానంతో ప్రజల్లోనూ పలు అంశాలపై అవగాహన కల్పిస్తేనే ఆ గురువు చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి కోవకు చెందిన వారే నిజామాబాద్ జిల్లా ధర్మారానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నర్రా రామారావు. వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేసి విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చడమే కాకుండా బడుల రూపురేఖలను మార్చారు. 2020లో పదవీ విరమణ పొందినా ఇప్పటికీ నిరంతర బోధకుడు, అనితర సాధకుడుగానే పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి : విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ,నిబద్ధత కలిగిన వ్యక్తిగా పేరుగాంచిన నర్రా రామారావు 1983లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. అంతకు ముందు వివిధ పాఠశాలలో పనిచేసిన ఆయన బదిలీల్లో భాగంగా 2014లో జిల్లాలోని బోర్గాం (పి) పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. రామారావు రాకముందు పాఠశాలలో 550 మంది విద్యార్థులుండగా 2019, 20 విద్యా సంవత్సరం వచ్చేసరికి ఆ సంఖ్య 1400 వందలకు చేరింది.
రూ.42 లక్షల నిధులతో భవన నిర్మాణాన్ని గుత్తేదారుకు ఇవ్వకుండా పాఠశాల యజమాన్య కమిటీతోనే నూతన గదులను నిర్మించేలా చేశారు. అంతే కాదు విద్యార్థుల చేరిక కోసం కరపత్రాలను పంచి ఫ్లెక్సీలను వేసి వినూత్నంగా ప్రచారం చేశారు. దీంతో వివిధ ప్రైవేటు పాఠశాలల నుంచి అనేకమంది విద్యార్థులు ఈ పాఠశాలలోనే చేరారు. అలా రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులున్న పాఠశాలగా రికార్డు సొంతం చేసుకుంది.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు : విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించేలా వారిని వెన్ను తట్టి ప్రోత్సహించేవారు నర్రా రామారావు. సైన్స్‌లో ఉన్న రహస్యాన్ని వినూత్నంగా బోధించి వారిని చైతన్యపరిచేవారు. క్రీడారంగంలో సైతం శిక్షణ ఇప్పిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపికయ్యేలా చూశారు. ఇలా ప్రతి ఆంశంలో ఉన్నతంగా ఆలోచించి అందరి అంచనాలకు భిన్నంగా పాఠశాల ఖ్యాతిని తారాస్థాయికి చేర్చారు.
ప్రధానోపాధ్యాయుడిగా రామారావు అందించిన సేవలకు ప్రభుత్వం 2005లో జిల్లాస్థాయి, 2007లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరించింది. 2018లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకుని ప్రధాని మోదీ ముందు సభలో ప్రసంగించారు. తానెప్పుడూ అవార్డులు, మెప్పుల కోసం పనిచేయలేదని సామాజిక బాధ్యతతోనే విధులు నిర్వర్తించానని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రామారావు చెబుతున్నారు.
మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి : రామారావు ప్రధానోపాధ్యాయుడుగానే కాకుండా సామాజిక కార్యకర్తగా మరో కోణాన్ని ఆవిష్కరించారు. మేడిచెట్టు నుంచి పాలు వస్తున్నాయని, చేత బడితో దుస్తులకు నిప్పంటుకుందని, వ్యాధులను చూసి భయపడే అమాయక, నిరక్షరాస్య ప్రజలెందరినో తన ఇంద్రజాల ప్రదర్శనలతో మెప్పించారు మంత్రాలు అభూత కల్పన అని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా రామారావు అనేక రచనలు చేశారు.
1992నుంచే జనవిజ్ఞాన వేదికలో పని చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు సమాజంలోని అంశాలను జోడించి పాఠాలను చెబితేనే ఉన్నత స్థానాలకు వెళ్తారని, ఆ బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుల మీద ఉందంటున్నారు రామారావు. సౌకర్యాలతో పాటు విద్యార్థులు లేక మూతపడే దశకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రామారావును స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని స్థానికులు అంటున్నారు.