Agarwood Interesting Facts : సాధారణంగా మొక్కలకు ఫంగస్, బూజు వంటివి పట్టకుండా రకరకాల రసాయనాలు చల్లి వాటిని కాపాడుకుంటాం. అయితే ఈ ప్రపంచంలో ఓ చెట్టుకి మాత్రం ఫంగస్ ఎక్కిస్తేనే బలంగా పెరుగుతుంది. ఫంగస్ కారణంగా సువాసనలు వెదజల్లే నూనెనూ, కలపనూ, మరికొన్ని ఉత్పత్తులనూ అందిస్తూ అన్నదాతలకు లాభాలు తెచ్చిపెట్టే ఆ చెట్టే అగార్ వుడ్. విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉన్న ఈ చెట్లని ఇప్పుడిప్పుడే మన దగ్గర సాగు చేస్తున్నారు. బంగారం లాంటి ఈ చెట్టు ఒక్కటి ఉన్నా పెంచిన వారికి కాసులు కురిపిస్తుంది.
అదెలాగంటే : సువాసనతో కూడిన కలప, అత్తరు, అగరు బత్తీలనూ అగార్ వుడ్‌తో తయారు చేస్తారన్నది మనకు తెలిసిన విషయమే. దీన్ని తైవాన్, లావోస్, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. అరబ్ దేశాల్లోనేమో విరివిగా కలపనూ, దానికి సంబంధించిన ఉత్పతులనూ వినియోగిస్తారు. కొన్నాళ్ల క్రితం త్రిపుర, అసోం, మిజోరం వంటి రాష్ట్రాల్లో అడుగుపెట్టిన అగార్ వుడ్ తెలుగునేలకూ వచ్చి చేరింది.
సువాసనలు వెదజల్లే కలప వృక్షాలైన ఎర్రచందనం, శ్రీగంధం లాంటిదే అగార్ వుడ్ కూడా. అయితే ఆ చెట్లు ఆదాయం తెచ్చిపెట్టాలంటే దాదాపు పాతిక నుంచి ముప్ఫై సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిందే. అదే అగార్ వుడ్‌ని సాగు చేస్తే నాలుగేళ్లకే ఆదాయం కళ్లజూడొచ్చు. ఒకసారి సాగు చేస్తే దాదాపు నలభై సంవత్సరాల పాటు పలు రకాలుగా ఆదాయం తెచ్చిపెడుతుంది ఈ చెట్టు. అగార్‌వుడ్ చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి. నాటిన నాలుగు సంవత్సరాలకి చెట్టు కాస్త లావు అయ్యాక కాండానికి రంధ్రాలు పెట్టి ఫంగస్‌ను ఎక్కిస్తారు.
![AGARWOOD INTERESTING FACTS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-10-2024/22720381_agarwood.png)
సెలైన్‌లా ఫంగస్ చెట్టుకి ఎక్కడం వల్ల కాండంలోపల రెజిన్‌లాంటి పదార్థం విడుదలవుతుంది. అది కాండంతో కలిసిపోయి కొన్ని రకాల రసాయనాలను విడుదల చేయడంతో అగార్ వుడ్ కలప సుగంధ భరితమవుతుంది. కాండంలోపల సువాసన వెదజల్లే కలప లేయర్ నల్లగానూ, ముదురు ఎరుపు రంగులోనూ ఉంటుంది. ఘాటైన సువాసనతో కూడిన ఆ భాగం అన్నదాతలకు భారీగానే లాభం చేకూర్చుతుంది.
ఎలాగంటే : అగార్ వుడ్‌కు ఫంగస్‌ని ఎక్కించాక రెజిన్‌లా ఏర్పడే కలపను- బెరడు తొలగించి సేకరిస్తుంటారు. అలా సేకరించిన అగార్ వుడ్ చెక్క ముక్కలను కిలోల చొప్పున అమ్ముతారు. ఒక చెట్టుకు ఆరునెలల్లో దాదాపు మూడు కిలోల దాకా చెక్క ముక్కలు వస్తే- కిలో ధర లక్ష నుంచి మూడు లక్షల వరకూ ఉంటుంది. ఈ చెక్కను అగరబత్తీల తయారీకీ, ధూపం వేసుకోవడానికీ ఉపయోగిస్తారు. బీడ్స్‌గా మార్చి దండలూ, బ్రెస్‌లెట్లగానూ రూపొందిస్తారు.
![Agarwood Interesting Facts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-10-2024/22720381_agarwood_2024.png)
కొందరేమో ఈ చెక్క ముక్కల్ని ప్రాసెస్ చేసి నూనె సేకరిస్తారు. మెడిసిన్, అత్తరు తయారీలో ఉపయోగించే ఈ నూనెకు అరబ్ దేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. నాణ్యతను బట్టి లీటరు నూనె ధర ముప్ఫై నుంచి డెబ్భై లక్షల వరకూ పలుకుతుంది. అలాంటివేమీ చేయకుండా కలప రూపంలో విక్రయించినా- ఫర్నిచర్ తయారీ సంస్థలు చక్కని గృహోపకరణాలను రూపొందిస్తాయి.
అగార్‌వుడ్ కలపతోపాటు ఆకులు కూడా ఉపయోగకరమైనవే. వాటిని ఎండబెట్టి గ్రీన్ టీ ఆకుల మాదిరిగా డ్రై లీవ్స్‌గానూ, పొడిగానూ మార్చి విక్రయిస్తారు. వీటితో చేసే టీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. రోజుకోసారి అగార్ వుడ్ టీతాగితే శ్వాస, ఒత్తిడి, జీర్ణసంబంధ, సమస్యలూ అదుపులోకి వచ్చి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కాబట్టే తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలు ఈ ఉత్పత్తులన్నీ తయారు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందుకే అంటారు అగార్ వుడ్ సువాసనల పంటే కాదు సిరుల పంట కూడా అని!