SP Warning To Man Not Taking Care of His Father in Guntur District : నాన్నపై మరోసారి చేయి చేసుకుంటే కేసు పెట్టి లోపలేస్తాం జాగ్రత్త, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అమ్మానాన్నలను చూసుకునే తీరు ఇదా? అంటూ ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను పోషించటం కుమారుల కనీస బాధ్యత అని గుర్తుచేశారు. యడ్లపాడు దిగువ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధుడు ఎడ్లూరి వెంకట్రావు, ఆయన కుమారుడు నాగరాజు మధ్య పదేళ్లుగా కుటుంబ కలహాలు ఉన్నాయి. కుమారుడి దురుసు ప్రవర్తనపై తండ్రి పదే పదే పోలీసులకు ఫిర్యాదు చేయడం పాటు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఎస్పీనే బుధవారం వెంకట్రావు ఇంటికి వెళ్లి సమస్య తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తనతో పాటు భార్య, కుమారుడు, కోడలు, మనుమలు ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిపారు. చెడు మార్గంలో వెళుతున్న కుమారుడిని పలుసార్లు హెచ్చరించినా తీరు మారలేదన్నారు. అతని కారణంగానే గతంలో అప్పులు చేసినట్లు చెప్పాడు. అప్పుల విషయంలో తనకు, కుమారుడికి మనస్పర్థలు పెరిగినట్లు తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న తనకు కుమారుడు తిండి పెట్టలేదన్నారు. విసిగిపోయిన తాను కుమారుడిని ఇల్లు విడిచి పోవాలని కోప్పడటంతో కుమారుడు తనను కొట్టినట్లు ఆ తండ్రి చెప్పాడు.
తండ్రి, అన్న కలిసి చంపేశారు - 24 రోజుల తరువాత ఏం జరిగిందంటే!
కుమారుడు నాగరాజు మాట్లాడుతూ తన తండ్రి మద్యం తాగి అప్పులు చేశాడని, తాను నూతన గృహం నిర్మించుకోవటానికి ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలం ఇవ్వటానికి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో నాగరాజుపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత నీదేనని తెలిపారు. తండ్రిని ఆదరిస్తే నూతన గృహ నిర్మాణానికి స్థలం ఇస్తాడని, కొడితే ఇవ్వడని, ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. తండ్రిపై మరో సారి చేయి చేసుకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇంటి నిర్మాణానికి సహకరించాలని స్థానిక పెద్దలను కోరారు. చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బనాయుడు, యడ్లపాడు ఎస్సై బాలకృష్ణ ఉన్నారు.