SP Ordered Inquiry on SI in the Case of Insulting TDP Leader: టీడీపీ నేతను అసభ్యంగా దూషించిన వ్యవహారంలో ఎస్సై నాగ శివారెడ్డిపై విచారణకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ పత్రాలు అందచేసేందుకు పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న టీడీపీ మండల అధ్యక్షుడు షంషుద్దీన్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై ఏలూరి సాంబశివరావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ విచారణాధికారిగా బాపట్ల డీఎస్సీ సీహెచ్ మురళీకృష్ణను నియమించారు. ఎస్సైను పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించి వివరణ అడిగారు.
ఈ క్రమంలో షోకాజ్ నోటీసు జారీ చేసి ఆర్వో కార్యాలయం వద్ద బందోబస్తు విధుల నుంచి తప్పించి అన్నంబొట్లవారిపాలెం చెక్‌పోస్ట్ వద్ద విధులకు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. బల్లికురవ ఎస్సైగా పని చేసిన సమయంలో నాగశివారెడ్డి స్టేషన్లో వైసీపీ నాయకులతో సత్కారం అందుకోవడం, బల్లికురవలోని ఓ బడ్డీ కొట్టులో మద్యం అమ్ముతున్నాడని ఓ వృద్ధుడ్ని కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇలా పలు అంశాల నేపథ్యంలో ఆ ఎస్సైని గతంలో జిల్లా ఎస్పీ వీఆర్‌కు పంపారు. ఈ క్రమంలో పర్చూరు ఆర్వో కార్యాలయం వద్ద విధుల్లో ఉంటూ టీడీపీ నాయకుడిపై అసభ్య పదజాలంతో దూషించడంతో ఎస్సై నాగశివారెడ్డి తీరు వివాదాస్పదమైంది.
ఉద్రిక్తత వాతావరణం: ప్రజలను బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారని ఎస్సై నాగశివారెడ్డిని ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ప్రజల హక్కులను కాలరాస్తారా టీడీపీ కార్యకర్తలను దూషిస్తూ వైసీపీ నేతలకు ఏజెంటుగా పని చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆర్వో గంధం రవీందర్‌కి రాత పూర్వకంగా లేఖ రాశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
గతంలో మహిళలు ఫిర్యాదు: గతంలో ఉప్పుమాగులూరులో టీ దుకాణం వద్ద జరిగిన గొడవలో ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ మద్దతుదారుడైన పిన్నేటి నాగరాజుపై కేసు నమోదు చేశారని బాధిత కుటుంబ సభ్యలు వాపోయారు. బల్లికురవ ఎస్సై నాగ శివారెడ్డిపై మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై అరాచకాలను, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని మహిళలు తెలిపారు. టీడీపీ మద్దతు దారుడని చిన్న సమస్యను పెద్దదిగా చేసి నాగరాజుపై ఎక్కువ కేసులు పెడుతున్నారని మహిళలు తెలిపారు. గొడవకు సంబంధం లేని వారిని కూడా ఈ కేసు ఇరికిస్తున్నారని మహిళలు ఎస్పీకి చెప్పినట్లు తెలిపారు.