Woman Died in Road Accident in Anantapur Districts : అమ్మాయి బీటెక్ చదువుకుంది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇంతలోనే తల్లి తీవ్ర అనారోగ్యం పాలయ్యింది. ఆ తల్లికి కూతురి పెళ్లి చూడాలని ఆశ. తన కళ్లముందే వేడుక జరగాలని కలలు కంది. ఆమె కోరిక మేరకు పెద్ద కూతురు పెళ్లి తంతుకు సిద్ధమైంది. తెల్లారితే నిశ్చితార్థం.
చేతికి గోరింటాకు పండితే మంచి భర్త వస్తాడనుకుంది. గోరింటాకు పెట్టించుకోవడానికి సోదరుడితో కలిసి పక్క ఊరికి వెళ్లింది. తిరిగి కాసేపట్లో ఇంటికి చేరుతామనుకుంటుండగా ఇంత లోనే ఆమెను మృత్యువు కబళించింది. సోదరుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన కన్నవారిని తీవ్ర విషాదంలో ముంచింది.
అమెరికాలో "అంతిమ ప్రయాణం" - చెదిరిన కలలు - చెమ్మగిల్లిన కళ్లు
Tractor Hits Bike Accident : అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్‌రెడ్డి, లక్ష్మీదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు గీత, చిన్నమ్మాయి బిందు, ఒక కుమారుడు నారాయణరెడ్డి ఉన్నారు. ఆ దంపతులు ముగ్గురినీ బీటెక్ చదివించారు. తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కోరిక మేరకు పెద్దకుమార్తె గీత(24)కు పెళ్లి చేయాలనుకున్నారు. ఓ సంబంధం కుదరడంతో ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నారు.
వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు. గీత గోరింటాకు పెట్టించుకోవడానికి సోదరుడు నారాయణరెడ్డితో కలిసి ద్విచక్రవాహనంలో తాడిపత్రికి వెళ్లింది. పని అయిపోయాక గ్రామానికి బయలుదేరారు. గ్రామం వద్దకు రాగానే ఎదురుగా బుగ్గవైపు నుంచి వచ్చిన ట్రాక్టర్ వారిని వాహనాన్ని ఢీ కొనడంతో గీతా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో నారాయణరెడ్డి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.
స్థానికులు నారాయణరెడ్డిని వెంటనే 108 వాహనంలో తాడిపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అనంతపురం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. కూతురి మృతదేహం వద్ద తల్లి గుండె పగిలేలా ఏడ్చింది. 'పెళ్లి ముచ్చట తీరకుండానే వెళ్లిపోయావా తల్లీ' అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అందర్నీ కలచివేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మృతి