Transgender Sneha Becoming Inspiration : ట్రాన్స్‌జెండర్లంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు ఛీత్కారాలు ఈ భావనను పోగొట్టే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది స్నేహ. ‘ఇట్స్ మీ స్నేహ’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనలాంటి ట్రాన్స్‌జెండర్ల జీవనశైలి గురించి తెలియజేస్తోంది. ప్రజలను ఆలోచింపజేసేలా వీడియోలు చేస్తోంది. 2023లో తెలంగాణ బీసీ సంక్షేమశాఖ నుంచి బెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డును అందుకుంది.
భిక్షాటన చేస్తూ ఎంబీఏ పూర్తి చేసి : వరంగల్ నగరానికి చెందిన స్నేహ అబ్బాయిగా పుట్టినా వయసు పెరిగే కొద్దీ హార్మోన్ల అసమతౌల్యం వల్ల అమ్మాయిలా ప్రవర్తించేది. ఈ విషయం తెలుసుకున్న తల్లితండ్రులు నిత్యం మందలించడంతో మనోవేధనకు గురయ్యేది. పదో తరగతి పూర్తయ్యాక పై చదువులు చదివించేందుకు తల్లితండ్రులు సపోర్ట్ చేయలేదు. దీంతో ఇంట్లోంచి బయటికొచ్చి ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు లైలా వద్ద ఆశ్రయం పొందింది. తన పేరును స్నేహగా మార్చుకుంది. భిక్షాటనతో చేస్తూ దూరవిద్య ద్వారా ఎంఏ పట్టా పొందింది. అనంతరం ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఎవరూ ఇవ్వకలేదు.
పేదలకు అండగా ట్రాన్స్‌జెండర్- ఏడాదికి 10మంది యువతులకు పెళ్లిళ్లు- గత 12 ఏళ్లుగా ఇలానే!
తమ బతుకుల్లో వెలుగులు తీసుకురావాలని : కరోనా లాక్‌డౌన్ సమయంలో ట్రాన్స్‌జెండర్లు ఆకలితో అలమటించిపోయారు. దాతలు కరుణిస్తే తిండి లేకపోతే పస్తులు అన్నట్లుగా కాలాన్ని వెల్లదిశారు. అదే సమయంలో స్నేహ సృజనాత్మకతకు పదును పెట్టి కొత్త దారి కోసం వెతికింది. తమ బతుకుల్లో చీకట్లను వెలుగులోకి తీసుకురావాలని యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది.
చీదరించుకున్న వారే దగ్గరకు తీసి : ట్రాన్స్‌జెండర్ల జీవనశైలి, పాటించే సంప్రదాయాలు, వివాహాలు, అంత్యక్రియలు ఇలా వివిధ అంశాలపై 600కి పైగా వీడియోలు చేసి యూట్యాబ్‌లో పెట్టింది. కొన్ని వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఛానల్‌కు 5.5 లక్షల మందికిపైగా సబ్ స్క్రయిబర్లు ఉన్నారు. ఒకనాడు భిక్షాటన చేసిన చేతితో నేడు రూ.వేలల్లో అర్జిస్తోంది. చీదరించుకున్న కుటుంబ సభ్యులే నేడు దరిచేరారు. తల్లి చనిపోగా చెల్లెలికి, తమ్ముడికి పెళ్లిళ్లు చేసింది. తండ్రికి అన్ని తానై పోషిస్తోంది. తమపై ఉండే అపోహలను తొలగించడానికే తన ఛానల్ ద్వారా ప్రయత్నిస్తున్నానని స్నేహ చెబుతోంది.
పేద జంటలకు పెళ్లిళ్లు చేయించిన ట్రాన్స్‌జెండర్- భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ముతో సాయం