Skill Development Training for Unemployed Youth in West Godavari : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పీఎం లంక గ్రామంలోని డిజిటల్ కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని 2022లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామీణ యువత, మహిళలు ముఖ్యంగా చేతివృత్తుల వారికి నైపుణ్యంలో శిక్షణ అందించడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. మూడు అంతస్తుల ఈ భవనంలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను అందించడం ద్వారా వారు ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు అండగా నిలబడే విధంగా ఇక్కడ పలు రకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రికల్ నుంచి సాఫ్ట్ వేర్ కోర్సుల వరకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
మూడు నెలలపాటు ఉచిత శిక్షణ : ప్రతి కోర్సులోనూ 30 మందిని తీసుకుని నెల నుంచి మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వసతి, భోజన సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నారు. శిక్షణానంతరం వారి నైపుణ్యాల ఆధారంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వారికి ఉపాధి అవకాశాలను అందించేందుకు కృషి చేస్తున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ర్టక్షన్ సంస్థ ఎలక్ట్రికల్ కోర్సులో శిక్షణ ఇస్తుండగా ఇందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది.
పేపర్‌లెస్ ఏపీ అసెంబ్లీ- నేషనల్ ఇ-విధాన్‌తో అనుసంధానం - AP Assembly Turns to Paperless
నేను బీటెక్ పూర్తి చేశాను. జాబ్ చేయాలని వెళ్లితే కోర్సులు రావాలని అంటున్నారు. ఇక్కడ కోర్సులు నేర్పుతున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. య్యూజర్ ఇంటర్ఫేస్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ ఫీజు తీసుకోరు. హస్టల్ సదుపాయం ఉంది. అనుభవం కలిగిన అధ్యాపకులే ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు- సాయిరామ్ తేజ, బూరుగుపాలెం
ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయం : డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగాలు రాక ఖాళీగా ఉన్న యువతకు సైతం ఈ కేంద్రం ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని అందిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన యువతకు పలు సాఫ్ట్ వేర్ కోర్సులను ఉచితంగానే అందిస్తూ వారి నైపుణ్యాలకు పదును పెట్టుకునేలా దోహదం చేస్తోంది.
సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ముఖ్యంగా ఆప్లికేషన్ డెవలపర్, వెబ్ డిజైనింగ్, కోడింగ్ వంటి వాటితో పాటు పీఎం విశ్వ కర్మ యోజన కింద చేతివృత్తుల వారికి కూడా నైపుణ్య శిక్షణ అందిస్తోంది. శిక్షణ అనంతరం ఉచితంగా టూల్‌కిట్‌తో పాటు లక్ష రూపాయల వరకూ ఎలాంటి హామీ అవసరం లేకుండానే రుణం అందిస్తోంది. ఇప్పటి వరకూ ఇక్కడ దాదాపు 1500 మందికి పైగా వివిధ కోర్సులు, వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో పలువురు విదేశాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు.
'యూ ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్' - అంటే నమ్మకండి! - cyber crimes in AP