Telangana HC Acquits Man In Mother Murder Case : కోర్టుల్లో తరగని పెండింగ్ కేసులతో బాధితులకు సకాలంలో న్యాయం అందడం లేదు. క్రిమినల్ కేసుల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బెయిలు పిటిషన్లతో సహా క్రిమినల్ అప్పీళ్లపై విచారణలో జరిగే జాప్యంతో న్యాయం దక్కేలోపు పలువురు ఖైదీలు జైల్లోనే చనిపోతున్నారు.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన పెద్దగుండెల అలియాస్ గుండెల పోచయ్య, తన తల్లి ఎల్లవ్వను హత్య చేశాడనే నేరంపై పోలీసులు 2013లో అరెస్ట్ చేశారు. వృద్ధురాలైన తల్లిని పోషించలేక ఆమెను చెట్టుకు టవల్‌తో ఉరి వేసి చంపాడనే ఆరోపణలపై దుబ్బాక పోలీసులు పోచయ్యపై కోర్టులో అభియోగాలు మోపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించి సిద్దిపేట కోర్టు 2015 జనవరి 12న పోచయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
దీంతో పోచయ్యను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. అదే సంవత్సరం పోచయ్య చిన్న కొడుకు దావిద్ హైకోర్టులో తన తండ్రి తరఫున అప్పీలు దాఖలు చేశారు. ఈ సమయంలో బెయిలు పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది జులైలో ఈ అప్పీలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. తల్లి హత్య కేసులో పోచయ్యను నిర్దోషిగా తేల్చి తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది.
పోచయ్య ఆరుసంవత్సరాల క్రితమే చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చర్లపల్లి ఓపెన్ జైలులో (శిక్ష అనుభవిస్తున్న పోచయ్య 2018 ఆగస్టు 15న అనారోగ్యానికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 16న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స అందించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆయన చిన్న కుమారుడు దావిద్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
సమాచారం అందని వైనం: పదేళ్లకు పైబడిన కేసులను పరిష్కరించాలన్న లక్ష్యంతో ఇటీవల హైకోర్టు ప్రత్యేక విచారణ చేపట్టింది. అందులో భాగంగా పోచయ్య అప్పీలుపై ధర్మాసనం విచారించింది. 'సాక్షులెవరూ అప్పీలుదారుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం చెప్పలేదు. అయినా, కేవలం వైద్యుడు, దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా కింది కోర్టు శిక్ష విధించడం సరికాదంటూ' హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
అయితే జైలులో ఖైదీ చనిపోయినపుడు సాధారణంగా ఆ సమాచారాన్ని జైలు అధికారులు సెషన్స్ కోర్టుకు అందజేస్తారు. ఖైదీ అప్పీలు పెండింగ్‌లో ఉన్నపుడు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు తెలియజేయాలి. కానీ పోచయ్య విషయంలో ఎవరూ చెప్పలేదు. కేసు విచారణలో ఉండగా అప్పీలుదారు మృతిచెందితే ఆ విషయాన్ని నమోదు చేస్తూ హైకోర్టు విచారణను మూసివేస్తుంది. పోచయ్య మరణించడంతో కుటుంబసభ్యులు అప్పీలు గురించి పట్టించుకోవడం మానేశారు.
ఆధునిక యుగమా? ఆదిమ కాలమా! - గిరిజన ప్రాంతాల్లో వసతుల లేమిపై హైకోర్టు వ్యాఖ్య
పోచయ్య ఏర్పాటు చేసుకున్న న్యాయవాది కూడా మృతిచెందారు. పోచయ్య మృతిపై హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తమ ముందున్న ఆధారాలతో వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మృతిచెందిన ఖైదీల కేసుల వివరాలు జైలు అధికారుల వద్ద కూడా ఉంటాయని, మృతి సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అందజేస్తే ఇలాంటి సంఘటనలకు ఆస్కారం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- 2013 ఫిబ్రవరి 1: తల్లిని హత్య చేశాడని కొడుకు అరెస్టు
- 2015 జనవరి 12: యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు
- 2015: హైకోర్టులో అప్పీలు దాఖలు.
- 2024 జులై 25: నిర్దోషిగా తేలుస్తూ విడుదలకు హైకోర్టు ఆదేశం
- 11 ఏళ్లకు బాధితుడికి న్యాయం దక్కిందని అంతా భావించారు.
- కానీ, అతను జైల్లో శిక్ష అనుభవిస్తూ ఆరేళ్ల క్రితమే చనిపోయాడు.
- కోర్టులో వాదించిన న్యాయవాదులకు ఈ సమాచారం లేకపోవడం గమనార్హం!
తండ్రి కష్టమూ అందలేదు : నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్న పోచయ్య ఎట్టకేలకు నిర్దోషిగా తేలడం సంతోషంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఓపెన్ ఎయిర్ జైల్లో పోచయ్య చేసిన కూలి పనులకు సంబంధించిన డబ్బు తమకు అందలేదని కుమారుడు దావిద్ ఆవేదన వ్యక్తం చేశారు. పోచయ్యకు జైల్లో సుమారు రూ.20 వేల వరకూ రావాల్సి ఉందని తెలిపారు.
జైలు అధికారులు మృతి చెందిన పోచయ్య పేరుతోనే తమకు మనీఆర్డరు చేశారని వెల్లడించారు. కానీ, చనిపోయిన వ్యక్తి పేరుతో వచ్చిన డబ్బులను ఇవ్వలేమంటూ పోస్టాఫీసు అధికారులు ఆ సొమ్మును వెనక్కి పంపారని దావిద్ తెలిపారు. పోచయ్య పెద్ద కుమారుడు జయరాజ్ గ్రామంలో కూలి పనులు చేస్తుకుంటున్నారు. చిన్న కుమారుడు దావిద్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తల్లి, భార్యతో కలిసి ఉంటున్నారు.