SIT Formed to Investigate Ration Rice Export Illegally: రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాకినాడ్ పోర్టు కేంద్రంగా జరిగిన బియ్యం అక్రమ ఎగుమతులపై 13 కేసులు నమోదు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా సిట్‌కు వివిధ అధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
కాకినాడ సెజ్ కేంద్రంగా జరిగిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందరరావు, గోవిందరావు, రత్తయ్యలను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ్ సెజ్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై ప్రభుత్వం 13 కేసులు నమోదు చేసింది.
సిట్‌కు వివిధ అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం: భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 ఆధారంగా కేసులు దర్యాప్తు చేసి విచారణ చేపట్టాల్సిందిగా సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సోదాలు, తనిఖీలు, జప్తు, అరెస్టు లాంటి అధికారాలను సిట్‌కు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా సిట్‌ను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లబ్దిదారులకు అందించే రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం వచ్చిందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
"సీజ్ ద షిప్" - పవన్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు - రెండ్రోజుల్లో రిజల్ట్!
స్మగ్లింగ్ వెనుక ఉన్న వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి: దీని వెనుక అక్రమార్కులు ఎవరున్నారో కనిపెట్టాల్సిందిగా సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ఉన్న వ్యక్తుల్ని చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. సబ్సిడీ కింద లబ్దిదారులకు అందించే ఈ రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి వివిధ పోర్టుల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్టు విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ కూడా నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ బియ్యానికి పాలిష్ పెట్టి, దాన్ని ప్రీమియం క్వాలిటీగా రీబ్రాండింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నట్టు తేలిందని ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించినట్టు స్పష్టం చేసింది.
ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలకు వీటిని ఎగుమతి చేసి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొంది. కస్టమ్ హౌస్ ఏజెంట్లతో మిలాఖత్ అయ్యి, సదరు బియ్యానికి నకిలీ పత్రాలు కూడా సృష్టిస్తున్నట్టుగా వెల్లడైందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సబ్సిడీ బియ్యాన్ని పాలిష్ పట్టిన అనంతరం వాటిని ఉప్పుడు బియ్యంగా, నూక బియ్యంగా పేరు మార్చి అక్రమంగా ఎగుమతులు చేస్తున్నారని వీటిపై పూర్తి విచారణ చేయాల్సిందిగా సిట్‌ను ఆదేశించింది. కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టుగా విజిలెన్సు నివేదికలో పేర్కొన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. తరచూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్సు విభాగం కూడా దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది.
బియ్యం మాఫియాలో సీనియర్ల హస్తం - అదే బాధ కలిగించింది: నాదెండ్ల