SIT Formation on Violence Incidents in AP: రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనా సిట్ నివేదిక ఇవ్వనుంది. పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరపనుంది. ఈ ఘటనలపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారంలోపు సిట్ తనప్రాథమిక నివేదికను ఎలక్షన్ కమిషన్కు సమర్పించనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది.
సిట్ సభ్యులు:
- ఏసీబీ ఎస్పీ రమాదేవి
- ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత
- శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి
- సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు
- ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు
- తిరుపతి ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి
- గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ వి.భూషణం
- విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటరావు
- ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ
- జీఎల్ శ్రీనివాస్
- శివప్రసాద్
- ఒంగోలు పీటీసీ మోయిన్
- అనంతపురం ఏసీబీ ప్రభాకర్
ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటుకు కసరత్తు పూర్తి- ఈ రాత్రికి ప్రకటన - SIT Inquiry on Election Violence
కాగా తాజాగా విశాఖలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తెచ్చే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన హద్దులు దాటి వ్యవహరించారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. రాష్ట్రంలో చోటుచేసుకున్న ప్రతి హింసాత్మక ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. వివిధ ఘటనల్లో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పలువురు అధికారులపై వేటు వేసిన సంగతి తెలిసిందే.
దీంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న, కొందరు అభ్యర్థులతో అంటకాగిన మరికొందరు పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులూ జరిగే అవకాశం ఉంది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేశారు. ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు.