Diwali Bonus for Singareni Workers : దీపావళి బోనస్‌గా పిలవబడే పీఎల్ఆర్ఎస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ స్కీమ్) బోనస్‌ను సింగరేణి కార్మికులకు శుక్రవారం చెల్లిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. దీని కోసం సింగరేణి సంస్థ రూ.358 కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాంను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సింగరేణిపై సమీక్ష సందర్భంగా భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికం కావడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దీపావళి బోనస్ కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750లు అందుకోనున్నారు. దీపావళి బోనస్ సంస్థలో పని చేస్తున్న దాదాపు 40,000 మంది కార్మికులకు వర్తిస్తుంది. జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్‌ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంది. ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు.
నెలలో రూ.3 లక్షల బోనస్ : ఇటీవలే లాభాల వాటా కింద సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం అంటే రూ.796 కోట్లను కంపెనీ పంపిణీ చేసిందని సింగరేణి సీఎండీ బలరాం నాయక్ పేర్కొన్నారు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1 లక్షా 90 వేలు అందాయని వివరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5 వేల చొప్పున చెల్లించామని గుర్తు చేశారు. పండుగ అడ్వాన్స్ కింద ఒక్కొక్క కార్మికునికి రూ.25 వేల చొప్పున మరో రూ.90 కోట్లను కంపెనీ చెల్లించింది. ప్రస్తుతం దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున రూ.93,450లు లభిస్తాయని వివరించారు. మొత్తమ్మీద ఈ నెల రోజుల వ్యవధిలో దీపావళి బోనస్, లాభాల వాటా, పండుగ అడ్వాన్స్ కింద మొత్తం రూ.1250 కోట్లను కంపెనీ చెల్లించింది. ఈ విధంగా సగటున సింగరేణి ఉద్యోగులు ఈ నెల రోజుల కాలంలో ఒక్కొక్కరు సుమారు రూ.3 లక్షల వరకు అందుకున్నారు.