Simhachalam Chandanotsavam: భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన విశాఖ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూపంలోకి తీసుకొచ్చారు. సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి తొలి దర్శనం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు, కుటుంబ సభ్యులు చేసుకున్నారు. అదే విధంగా శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు.
ఆ తర్వాత వేకువజామున రెండు గంటల నుంచి సాధారణ భక్తులకు అవకాశం కల్పించారు. భక్తులు వేకువ జాము నుండే నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. ప్రోటోకాల్ దర్శనాలు ఎక్కువగా లేకపోవడంతో క్యూ లైన్లు సాఫీగా సాగిపోతున్నాయి. అప్పన్న స్వామి నిజరూప దర్శనం చేసుకుంటే సకల శుభాలూ కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేకువజాము నుంచే సింహగిరిపై పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. గోవింద నామాలతో సింహాచల పుణ్యక్షేత్రం మారుమోగుతోంది.
స్వామివారి దర్శనానికి కొండ పైకి ఉచిత బస్సు సౌకర్యం: కొండ పైకి ఉచిత బస్లు ఆర్టీసీ దేవస్థానం నడుపుతోంది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. క్యూ లైన్లో ఎండ వేడిమికి ఉపశమనంగా కూలర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా బార్ కోడ్ విధానంలో టికెట్ స్కాన్ చేసే ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు, దేవస్దాన అనుమతి వాహనాలు మినహా ఇతర వాహనాలకు కొండపైకి అనుమతించడం లేదు.
విధుల్లో సుమారు 2 వేల మంది పోలీసులు: సుమారు లక్షా ముప్పై వేల మంది భక్తులు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేశామని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఎండ వేడిమికి తట్టుకునేలా కూలర్ ఏర్పాటు చేశామన్నారు. చందనోత్సవం కోసం సెక్యూరిటీ ఏర్పాట్లు చక్కగా చేశామని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవి శంకర్ అయ్యన్నర్ తెలిపారు. సుమారు రెండు వేల మంది పోలీసులు వీధుల్లో ఉన్నారని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు మూడు ప్రత్యేక క్రేన్లు కూడా ట్రాఫిక్ విభాగం ఏర్పాటు చేసింది. ఘాట్ రోడ్లో పూర్తిగా వన్ వే విధానంతో అనుమతి తీసుకున్న వాహన రాకపోకలను అనుమతిస్తున్నారు.