Sheep Distribution Scam Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కేసులో (Sheep Distribution Case) నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను కస్టడీలోకి తీసుకొని విచారించిన ఏసీబీ కీలకమైన వివరాలు రాబట్టింది. ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ ముఠా నిధుల మళ్లింపులకి పశుసంవర్ధక శాఖలోని సీనియర్ అధికారిపాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవ సరఫరాదారుల బ్యాంకు ఖాతాలకు బదులు మొహిదుద్దీన్ బినామీల బ్యాంకు ఖాతాలను రికార్డుల్లో చేర్చినందుకు ఆ అధికారికి లక్షల్లోనే వాటాలు పొందినట్లు ఏసీబీ భావిస్తోంది. అతడి ఒత్తిడితోనే నలుగురు అధికారులు మొహిదుద్దీన్ ముఠాకు సహకరించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ తరుణంలో పలువురు పశుసంవర్ధకశాఖ అధికారులను ఏసీబీ పిలిపించి విచారించారు.
ACB Investigation on Sheep Distribution Scam : గొర్రెల సరఫరాదారుల బ్యాంకు ఖాతాల వివరాలకు బదులుగా ఇతరుల బ్యాంకు ఖాతాలను రికార్డుల్లో చేర్చేందుకు దారితీసిన పరిస్థితిపై వివరాలు సేకరించారు. పశుసంవర్ధ శాఖని గుప్పిట పెట్టుకున్న మొహిదుద్దీన్ అనుచరగణమే రికార్డుల ట్యాంపరింగ్‌కి పాల్పడ్డాడని గుర్తించారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని లబ్దిదారులను అధికారులు తమ వెంట తీసుకెళ్లి పొరుగు రాష్ట్రాల సరఫరాదారులతో సంప్రదింపులు జరిపించాలి. అక్కడే వారం, 10 రోజుల పాటు శిబిరం నిర్వహించి గొర్రెలను రాష్ట్రంలోని లబ్దిదారులకు ఇప్పించడం సహా సరఫరాదారుల బ్యాంకు ఖాతాల వివరాలను పథకానికి ఉద్దేశించిన డేటాషీట్‌లో నిక్షిప్తం చేయాలి.
గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు - 2 కోట్ల నిధులకు పైగా దారి మళ్లినట్లు గుర్తింపు
Sheep Distribution Scam : అనంతరం సరఫరాదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వ నిధులు జమ అవుతాయి. అక్కడే మొహిదుద్దీన్ ముఠా కుట్రకు తెరతీసింది. తన సిబ్బందిని మోహిదుద్దీన్ రంగంలోకి దించాడు. అధికారులను పక్కన పెట్టి బ్యాంకు ఖాతాల వివరాల నమోదు చేశారు. వాస్తవ సరఫరాదారుల నుంచి బ్యాంకు వివరాలు సేకరించినా డేటాషీట్లో మాత్రం నిక్షిప్తం చేయలేదు. అసలు సరఫరాదారులకు బదులుగా మొహిదుద్దీన్ సూచించిన సుమారు 10 మంది బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేశారు. వారంతా మొహిదుద్దీన్ బినామీలే. సరఫరాదారులకు కాకుండా మొహిదుద్దీన్ బినామీల ఖాతాల్లోకి రూ. 2.10 కోట్లు మళ్లించారు.
బినామీల ఖాతాల్లోకి నిధులు జమ అయిన రోజే మొహిదుద్దీన్ ఆ సొమ్మును వారి ఖాతాల్లో నుంచి తీసేసుకున్నాడు. ఖర్చులు పోగా ఒక్కో యూనిట్‌కి లక్షా 58 వేల చొప్పున మొత్తం 133 యూనిట్లకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. ఐతే సరఫరాదారులకు మాత్రం లక్ష 25 నుంచి లక్షా 30 వేల చొప్పున ఇస్తామని మొహిదుద్దీన్ ముఠా తొలుత అధికారులతో చెప్పించింది.
ఆ విధంగా ఒక్కోయూనిట్లో సుమారు రూ.30వేల వరకు కాజేసే పథకానికి తెరతీసినా చివరకు మొత్తం నిధులు కాజేసి సరఫరాదారులని నట్టేట ముంచారు. రికార్డుల్లో బ్యాంకు ఖాతాలు మార్చేందుకు సహకరించినందుకు ప్రభుత్వ అధికారులకి వాటాలు అందించారు. విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, విజయవాడ తదితర ప్రాంతాల్లో బినామీలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తోంది.