Severe Heat Waves Affect Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల నుంచే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని స్పష్టం చేసింది.
ఏప్రిల్ , మే నెలల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమవుతాయని వెల్లడించింది. తీవ్రమైన వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. వడగాడ్పులు తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్ ఫోన్లకు హెచ్చరికల సందేశాలు పంపాలని నిర్ణయించారు.
ఎండలపై సమాచారం కోసం విపత్తు నిర్వహణా సంస్థలో 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేయనున్నట్టు ఆ సంస్థ ఎండీ ఆర్. కూర్మనాథ్ తెలిపారు.
కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్రంగానూ , అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గత ఏడాదిలోనూ గరిష్ఠంగా 48.6 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దాఖలాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
'వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వడగాల్పులు'- ఐఎండీ హెచ్చరిక
అయితే ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా తెలంగాణ, ఉత్తర కర్ణాటకతోపాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీయవచ్చని కొద్ది రోజుల భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ ఏడాది వేసవి కాలం భానుడి మంటలతోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ఈ సంవత్సరం వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
మార్చి నెల నుంచి మే వరకూ దేశంలో అనేకచోట్ల సాధారణం కంటే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, మధ్య భారత్‌లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత లేకపోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వేసవివరకూ ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని అన్నారు. మరోవైపు దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లా నినా (La Nina) పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా వేసింది. అయితే మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.