Severe Damage Canals in Guntur Irrigation Dept. Focus to Revive : ప్రకృతి ప్రకోపం, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. కృష్ణా నది వరద ఉద్ధృతితో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక పంట కాలువలు ఇలా కోతకు గురయ్యాయి. కృష్ణా నదికి చరిత్రలో లేని విధంగా వరద పోటెత్తడంతో కాలువలు, డ్రెయిన్లకు వందల సంఖ్యలో గండ్లు పడ్డాయి. వర్షాలు, వరదలకు ఉప్పొంగిన వాగులు, కాలువలు, డ్రెయిన్లలోకి పోటెత్తాయి. ఫలితంగా కాల్వల సామర్థ్యం చాలక గండ్లు పడి వరద పొలాల్ని ముంచెత్తింది. కాలువలకు గండ్లు తాత్కాలికంగా పూడ్చడం, కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మతు చేపట్టడం ఇప్పుడు అధికారులకు కత్తిమీద సాములా మారింది.
ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ప్రధాన కాలువల్లో ఒకటైన గుంటూరు ఛానల్‌కు వరద వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఉండవల్లి సమీపంలో మొదలయ్యే ఈ కాలువ వట్టిచెరుకూరు మండలం గారపాడు వరకు 47 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వర్షపునీటితోపాటు పట్టణాల్లోని మురుగు మొత్తం గుంటూరు వాహినిలోకి రావడంతో 45 చోట్ల గండ్లు పడ్డాయి. కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు పడిన గండ్లు పూడ్చడానికి అధికారులు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.
'చిన్న నీటిపారుదల శాఖ పరిధిలో గుంటూరు జిల్లాలో మూడు, పల్నాడు జిల్లాలో 22 చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ కట్టలకు త్వరగా మరమ్మతు చేయాలి. మంగళగిరి మండలం పెదవడ్లపూడి పరిధిలో గండ్లు కారణంగా వందల ఎకరాలు వరి పొలాలు, మల్లె తోటలు నీట మునిగాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కసారి కూడా కాలువల నిర్వహణ చేపట్టనందునే పూడిక పెరిగి వరద చేలపై పడింది.' - రైతులు
గుంటూరు జిల్లాలో కాలువ కట్టలు కుంగటం, గండ్లు పడటం, కోతకు గురవడం ఇలాంటి పనులు మొత్తంగా 441 చోట్ల చేపట్టాల్సి ఉంది. తాత్కాలిక పనుల కోసం 24 కోట్ల 10లక్షలు అవసరమని, శాశ్వత ప్రాతిపదికన కట్టల బలోపేతానికి 180కోట్లు అవసరమని మొత్తంగా మూడు జిల్లాల పరిధిలో 204 కోట్ల నిధులు కావాలని అధికారులు తేల్చారు. కొన్ని చోట్ల ఇప్పటికే గండ్లు పూడ్చే పనులు మొదలు పెట్టామని జలవనరులశాఖ ఇంఛార్జ్ కార్యనిర్వాహక ఇంజినీరు ప్రసాదరావు తెలిపారు. కట్టలు బాగా నానిపోయి ఉండడంతో బలోపేతం చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు.