Seven Years Girl Dead Body Found in Chittoor District : చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక అస్పియా అంజుమ్(7) కథ దుఃఖాంతమైంది. పుంగనూరులో ఆదివారం అదృశ్యమైన బాలిక పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నిన్న(బుధవారం) శవమై కనిపించింది. చిన్నారి మరణవార్త తెలుసుకున్న పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అదే రోజు ఫిర్యాదు : ఆదివారం రాత్రి బాలిక అదృశ్యం కాగా స్థానిక యువత, బంధువులు చుట్టుపక్కలంతా వెతికారు. ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అజ్ముతుల్లా, షమియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం డాగ్ స్క్వాడ్ బృందాలు ఉబేదుల్లా కాంపౌండ్, చెంగ్లాపురం రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలించాయి. ఎస్పీ మణికంఠ రెండు రోజులు అక్కడే ఉండి దర్యాప్తు పర్యవేక్షించారు. డీఐజీ షేముషి భాజ్‌పాయి మంగళవారం పుంగనూరు చేరుకుని బాధితులతో మాట్లాడారు.
అల్లూరి జిల్లాలో విషాదం - జలపాతంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతు - MBBS STUDENTS MISSING
ట్యాంకులో తేలిన మృతదేహం : పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన చిన్నారి కిడ్నాప్ చివరకు హత్యగా తేలింది. డీఎస్పీలు సాయికుమార్, ప్రభాకర్, సీఐలు, ఎస్సైలు బుధవారం వేకువజామున పట్టణ శివారులోని నక్కబండ, గూడూరుపల్లె సమీపం, చెంగ్లాపురంలో అనుమానిత ఇళ్లలో జల్లెడ పట్టారు. అయినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. నిన్న (బుధవారం) ఎస్‌ఎస్‌ట్యాంకులో మృతదేహం తేలడంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. చిన్నారి మృతదేహన్ని జేసీ విద్యాధరి, ఎస్పీ మణికంఠ పరిశీలించారు. ఎన్‌ఎస్ పేటలో ఈద్గా వద్ద అస్పియా అంజుమ్ ఆత్మశాంతికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సీసీ కెమెరాలు పరిశీలించినా లాభం లేదు : పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండ్‌లో బాలిక అదృశ్యమైంది. అక్కడ నుంచి పట్టణంలోని బస్టాండ్ లేదా ఎంబీటీ రోడ్డు, ఎన్టీఆర్ కూడలి, అంబేడ్కర్ కూడలి బైపాస్‌రోడ్డు, ఎన్‌ఎస్‌పేట దారిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వరకు బాలికను తీసుకెళ్లారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించినా ఆధారాలు లభించలేదని సమాచారం.
పరీక్షల నిమిత్తం తిరుపతికి : బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కొన్ని అవయవాలను పరీక్షల నిమిత్తం తిరుపతి పరిశోధనశాలకు పంపారు. రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. మరోవైపు చిన్నారి మృతిపై పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఎవరైనా హత్యచేసి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారా? లేదా ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావటంతో ఎవరైనా డబ్బులు కోసం కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
300మందితో వెళ్తున్న బోటుకు ప్రమాదం- 100మంది మిస్సింగ్- ఏం జరిగింది?