Seniors Attack On Junior In Rayalaseema university kurnool District : కళాశాలలలో విద్యార్థుల గొడవలు కొట్లాటలుగా మారి ఒకరిపై ఒకరు దాడికి దిగడం వల్ల ప్రాణాలు కోల్పోవడం, గాయాలపాలైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకే తరగతి వారు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం, పాత కక్షలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. 'సార్' అనలేదనో, 'నమస్తే' పెట్టలేదనో సీనియర్ల మాట వినకుండా ఎదురు చెప్తున్నారనో కాలేజీలో వివాదాలు తలెత్తిన ఘటలు కోకొల్లలు. ర్యాంగింగ్ చెయ్యకూడదని కఠినమైన నిబంధన ఉన్నప్పటికి కొన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చాప కింద నీరులా ఇవి జరుగుతూనే ఉన్నాయనడానికి నిదర్శనంగా సీనియర్, జూనియర్ విద్యార్థుల గొడవలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఘటన తాజాగా ఆర్యూ విశ్వవిద్యాలయంలో కలకలం రేపింది.
Fight Between Students in Campus : కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో సునీల్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిపై 15 మంది సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పలువురు సీనియర్లు పరిచయ వేదిక పేరుతో విద్యార్థిపై గురువారం అర్ధరాత్రి దాడికి దిగారు. క్రీడా మైదానంలో పరిగెత్తించడంతో పాటు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సునీల్‌ను తోటి విద్యార్థులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
దుస్తులు విప్పదీసి రోడ్డుపై ఈడ్చుకెళ్తూ విద్యార్థులపై దాడి - ATTACK ON STUDENTS
కళాశాలకు కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా ఘర్షణ తారాస్థాయికి చేరడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి కారణం పాత గొడవలేనని పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ అసలు విషయం దర్యాప్తు అనంతరం తెలియనుంది. విచారణ తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని అధికారులు అన్నారు. కళాశాల ప్రాంగణంలో జూనియర్ విద్యార్థి పట్ల సీనియర్లు ఈ విధంగా ప్రవర్తించడాన్ని యాజమాన్యం ఖండించింది. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో గాయాల పాలైన విద్యార్థి క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ - కత్తులు, కర్రలతో వీరవిహారం - Ganja Batches Attack