Road Connectivity in Amaravati: రాజధాని అమరావతిలో రహదారుల అనుసంధానం అత్యంత కీలకం కానుంది. 2014 తర్వాత రాజధాని నిర్మాణం ప్రారంభించినప్పుడే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాలమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. రూ. 242.30 కోట్ల వ్యయంతో 21.37 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణం చేపట్టింది. మొదటి దశలో దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు నిర్మాణం పూర్తి చేసింది.
2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికే 80 శాతానికి పైగా పనులు అయ్యాయి. ఆ తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పనులు పరుగెత్తించే ప్రణాళికతో ముందుకెళుతోంది. రాజధానిలో అత్యంత ప్రధానమైన రోడ్డు నెట్‌వర్క్‌ను తిరిగి చేపట్టడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పెండింగ్ పనులు, కరకట్ట రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
మంతెన ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు ఉన్న 3.80 కిలోమీటర్ల దారిని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. మధ్యలో ప్రజారవాణా కోసం బీఆర్టీఎస్ రోడ్డు నిర్మిస్తారు. ఈ పనుల కోసం 36 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అలాగే ఉండవల్లి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 3.10 కిలోమీటర్ల దూరం ఆరు వరుసల పైవంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీని కోసం 27.83 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 2014- 19 మధ్య కాలంలో సీడ్ యాక్సెస్ రోడ్డు భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి ప్రాంతాల్లో అభ్యంతరాలు వచ్చాయి.
రైతులు భూములు ఇవ్వకుండా అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెరవెనుక మంత్రాంగం నడిపారు. ఈ క్రమంలో కొందరు రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే గత ఐదేళ్లలో ఏకంగా రాజధాని మార్చేయడానికి జగన్ చేసిన కుట్రలతో రైతుల ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. ఈ పరిస్థితుల్లో విశాలమైన రహదారుల అవసరాన్ని ప్రజలకు వివరించి భూసేకరణ ప్రక్రియను సామరస్యంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గుంటూరు జిల్లా యంత్రాంగం, సీఆర్డీఏ అధికారులు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నారా లోకేశ్‌పై నమ్మకంతో 90 వేలకు పైగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించిన మంగళగిరి ప్రజలు భూసేకరణకు సహకరిస్తారని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. భూసేకరణ కొలిక్కి వస్తే వీలైనంత త్వరగా సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా కుడి కరకట్ట విస్తరణ పనులకు 2021 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
150 కోట్ల రూపాయలతో 15.5 కిలోమీటర్ల పొడవైన రెండు వరుసల రోడ్డు నిర్మాణ పనులను మెగా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ 31 మంది రైతులకు చెందిన 1.18 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనిపై 15 మంది రైతులు కోర్టుకు వెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడం ప్రభుత్వానికి సవాల్‌గా నిలవనుంది. గతంలో అనుకున్నట్లు రెండు వరుసలు కాకుండా నాలుగు వరుసలుగా కరకట్ట రోడ్డును అభివృద్ధి చేస్తే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్డు వెంట వాణిజ్య ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది.