Secunderabad to Goa Express Train Starts in a Week : ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునే తెలుగువారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురందించింది. హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా రైలు సర్వీసును వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వీక్లీ సర్వీసు, కాచిగూడ నుంచి నాలుగు బోగీల(జనరల్, ఏసీ, స్లీపర్ కోచ్) సర్వీసు గుంతకల్ వద్ద గోవా రైలుతో అనుసంధానమై వెళ్లేవి.
సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మార్చిలో లేఖ రాశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది. మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.
సికింద్రాబాద్ నుంచి చలో గోవా : ఈ మేరకు మరో వారం రోజుల్లో సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తుండగా ఇందులో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే కావటం గమనార్హం. నేరుగా రైలులో వెళ్లే సదుపాయం లేక, ఓన్ వెహికల్స్, ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్కడికి చేరుకుంటున్నారు.
ఇప్పుడీ పరిస్థితికి చెక్ పెట్టి, బుధ, శుక్ర వారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామకు, గురు, శనివారాల్లో రిటన్లో సికింద్రాబాద్‌కు సర్వీసులను అందుబాటులోకి రైల్వేశాఖ తెస్తుంది. టిక్కెట్ ధరలను రైల్వే అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. ఈ వీక్లీ ట్రైన్ సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకోనున్నట్లు రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది.