Scam in Stray Dogs ABC Program: అనంతపురం నగరపాలక సంస్థ పనితీరు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే పరికరాల కొనుగోలులో అవినీతి మొదలు, శునకాలకు ఆపరేషన్ల నిర్వహణ వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీధి శునకాలకు ఏబీసీ (Animal Birth Control) ఆపరేషన్ల నిర్వహణలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గనిర్దేశకాలిచ్చింది. ఈ నిబంధనలు జాతీయ, రాష్ట్ర స్థాయిలోని జంతు సంక్షేమ బోర్డు (Animal Welfare Board) పర్యవేక్షణ చేస్తుంది. అయితే ఈ నిబంధనలు ఏ మాత్రం ఖాతరు చేయని అనంత నగరపాలక సంస్థ అధికారులు, ఏబీసీ సెంటర్‌ను కాదని, ఆపరేషన్ల కోసం టెండర్లు నిర్వహించారు. కాగ, ఈ టెండర్‌ను ఓ స్వచ్చంద సంస్థ ఆపరేషన్ల నిర్వాహణ పనులు దక్కించుకుంది.
శస్త్రచికిత్స నిర్వహణ టెండర్ దక్కించుకున్న ఈ సంస్థపై పలు గతంలో ఆరోపణలు ఉన్నాయి. బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో జంతు హింసకు పాల్పడినట్లుగా ఆ సంస్థపై ఆరోపణలు రావడంతో బ్లాక్ లిస్టులో పెట్టినట్లు సమాచారం. ఇవన్నీ పట్టించుకోని అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు ఆ సంస్థతో ఇప్పటి వరకు 3500కు పైగా ఆపరేషన్లు చేసినట్లు చెబుతున్నారు. కేవలం 50 రోజుల్లో శునకాలకు ఇన్ని ఆపరేషన్లు ఇద్దరు వైద్యులే చేశారన్న వివరణలపై విమర్శలు వస్తున్నాయి.
కుక్కలు ఎందుకు వాహనాలను వెంటాడుతాయి? కారణాలు తెలిస్తే షాకే!
శునకాల పునరుత్పత్తిని నిరోధించడానికి నిర్వహించే శస్త్రచికిత్సల విషయంలో జంతు సంక్షేమ బోర్డు స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఏబీసీ కేంద్రం ఏర్పాటు, వీధి శునకాలను పట్టుకోవడం, ఆపరేషన్ నిర్వహించడం, శస్త్రచికిత్స అనంతరం పర్యవేక్షణ, తిరిగి వాటిని పట్టుకున్న చోట వదిలేయటం వరకు అన్నీ స్పష్టంగా చెప్పింది. వీటిని పట్టించుకోని అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు, బ్లాక్ లిస్టులో పెట్టిన సంస్థను పిలుచుకొచ్చి ఆపరేషన్లు చేయిస్తూ, ఓ ప్రాంతంలో పట్టుకున్న శునకాన్ని మరోచోట వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఆపరేషన్ చేసిన శునకాలను వాటిని పట్టుకున్న చోట కాకుండా ఇతర కాలనీల్లో వదలడంతో, అప్పటికే అక్కడున్న శునకాలు వాటిని రానివ్వకపోవడంతో కుక్కల పోట్లాటతో వీధుల్లో ప్రజలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు కొత్తగా కాలనీలోకి వచ్చిన శునకాలకు ఆహారం దొరక్క, పిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆసుపత్రులకు వస్తున్న కుక్కకాటు బాధితులు సంఖ్యను పరిశీలిస్తే, కాలనీల్లో వదిలిపెడుతున్న కొత్త కుక్కలే దాడులు చేసి కరుస్తున్నట్లు జంతు సంరక్షణ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
మీకు పెంపుడు జంతువులంటే ప్రాణమా? అయితే 'పెట్ ఇన్సూరెన్స్' మస్ట్! బెనిఫిట్స్ ఏమిటంటే?
శునకానికి ఆపరేషన్ చేసిన సంస్థకు నగరపాలక సంస్థ ఒక్కో దానికి 1500 రూపాయలు చెల్లిస్తోంది. అయితే ఇద్దరు వైద్యులే 50 రోజుల్లో 3500 శస్త్రచికిత్సలు చేశారని అధికారులు చెబుతుండటంపై సామాజిక మాధ్యమాల వేదికగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. శునకాలకు శస్త్రచికిత్సల నిర్వహణలో అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు నిబంధనలు పాటించకుండా జంతు హింసకు పాల్పడుతున్నారంటూ జంతు ప్రేమికులు కోర్టును ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు.
ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? - అయితే ఈ ఆహారాలు అస్సలు పెట్టకండి!