Save the Girl Child 2K Run: మగవారు మహిళల్లో తమ తల్లిని చూసినప్పుడే సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గుముఖం పడతాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల కూడలిలో నిర్వహించిన సేవ్ ది గర్ల్ చైల్డ్ 2కే రన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆడపిల్లలను కాపాడుకుందాం, భ్రూణ హత్యలు నివారిద్దాం, ఆడవారిపై అఘాయిత్యాలు అరికడదామనే నినాదాలతో ధర్మారావు ఫౌండేషన్ తరఫున నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి పాల్గొన్నారు. పొత్తిళ్లలోని పసి పిల్లలపైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే అది మానసిక రుగ్మత అనుకోవాలా అని హోం మంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని, ఆడపిల్లలను ఎంత బాధ్యతతో పెంచుతున్నారో, మగ పిల్లలను కూడా అలాగే పెంచాలని అనిత సూచించారు.
మళ్లీ అలాంటి రోజులు రావాలి: సామాజిక బాధ్యతతో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని అనుకునేవారని, మళ్లీ అలాంటి రోజులు రావాలని మంత్రి నిమ్మల ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.
భువనేశ్వర్ నుంచి వచ్చిన ఇండియాస్ గాట్ టాలెంట్ (India's Got Talent) యువకుల ప్రదర్శన ఆకట్టుకుంది. విశాఖ యువకులు ప్రదర్శించిన ఎయిర్ వాక్ షో, చిన్నారి గాయని వాగ్దేవి పాటలకు విద్యార్థులు కరతాళ ధ్వనులతో ప్రాంగణం మారు మోగింది. అనంతరం ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పేరుతో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను ఘనంగా సన్మానించగా, మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. ఈ రన్లో పాలకొల్లు పట్టణానికి చెందిన పలు పాఠశాల కళాశాలల విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
"మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలను ఎలా అయితే బాధ్యతగా పెంచుతున్నామో, అదే విధంగా మగపిల్లలను కూడా పెంచితే ఈరోజు సమాజంలో ఇన్ని అరాచకాలు జరిగేవి కావు. ముందుగా సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే ప్రతి ఇంటి నుంచి అమలు చేయాలి. ప్రతి ఒక్కరం ఆడబిడ్డలను రక్షిద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం". - హోంమంత్రి అనిత
మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై రాజకీయం తగదు - నేరస్థులు తప్పించుకోలేరు : హోమంత్రి అనిత
గడిచిన ఐదేళ్లలో మహిళలపై అఘాయిత్యాలు 20.8 శాతం పెరిగాయి: అనిత