Sand Mining in Patta Lands in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత తీర్చేందుకు పట్టా భూముల్లో తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను తవ్వి, వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం గనులశాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనికి ఈ నెల 28న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నట్లు తెలిసింది.
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. యంత్రాలతో అక్టోబరు నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. ఈలోపు అన్ని జిల్లాల్లో ఇసుక నిల్వలు తగ్గుతుండటంతో, వెంటనే నిల్వలు పెంచడంలో భాగంగా పట్టా భూముల్లో ఇసుకపై గనులశాఖ దృష్టిపెట్టింది. గతంలో ఏపీఎండీసీ (Andhra Pradesh Mineral Development Corporation Limited) ఆధ్వర్యంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వి విక్రయించారు. ఇప్పుడూ అలాగే పట్టా భూముల్లో ఇసుక తవ్వి, విక్రయించాలని, పట్టాదారుకు టన్నుకు 66 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.
త్వరలోనే ఆన్‌లైన్, సచివాలయాల్లో బుకింగ్ సదుపాయం: సీఎం చంద్రబాబు - CM Teleconference with Activists
నదీ గర్భంలో ఉండే పట్టా భూముల్లోని ఇసుకను ఆ జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయం మేరకు గనులశాఖ ద్వారా తవ్విస్తారు. ఇందులో పట్టాదారుకు చెల్లించే 66 రూపాయలు, సీనరేజ్ ఛార్జీలు 88 రూపాయలు, తవ్వకాలకు అయిన నామమాత్రపు ఖర్చు తీసుకుంటారు. నదీ గర్భంలో పట్టా భూములు ఉండి, అందులో ఇసుక మేటలు ఉన్నవాళ్లు అంగీకరిస్తే, వాటిలో ఇసుకను తవ్వుతారు. వీటికి పర్యావరణ సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఈ అనుమతుల అంశాన్ని ఆయా జిల్లాల గనులశాఖ చూసుకుంటుంది.
నది గర్భం బయట ఉండే పట్టా భూముల్లో ఇసుకను పట్టాదారు తవ్వి విక్రయించుకోవచ్చు. అయితే గనులశాఖ జారీచేసే ఆన్‌లైన్ పర్మిట్ల ద్వారా ఈ ఇసుకను విక్రయించాలి. ఎంత ధరకు విక్రయించాలనేదీ కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లాస్థాయి ఇసుక కమిటీ నిర్ణయిస్తుంది. పట్టాదారు విక్రయించిన ఇసుకలో టన్నుకు రూ.88 చొప్పున సీనరేజ్ చెల్లించాలి. ఈ సొమ్ము ఆయా స్థానిక సంస్థల ఖాతాలకు వెళ్తుంది. వీటికి పట్టాదారుడే పర్యావరణ అనుమతులు, కాలుష్య నియంత్రణ మండలికి ఫీజులు చెల్లించి, అనుమతులు తెచ్చుకోవాలి.
ఏపీలో ఉచిత ఇసుక విధానం వచ్చేసింది- జీవో జారీ చేసిన ప్రభుత్వం - Free Sand Policy Guidelines
ఇసుక అవసరమైనవాళ్లు ఆన్‌లైన్ ద్వారానే బుకింగ్ చేసుకునేలా గనులశాఖ పోర్టల్‌ను సిద్ధం చేస్తోంది. వచ్చే నెల 11 నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. సాధారణ వినియోగదారులు, బల్క్‌గా ఇసుక అవసరమైన గుత్తేదారులు, బిల్డర్లకు వేర్వేరుగా బుకింగ్ ఆప్షన్‌ను అధికారులు కల్పించనున్నారు. సాధారణంగా రోజుకు సగటున 75 నుంచి 80 వేల టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని అధికారుల అంచనా. ప్రస్తుతం నిత్యం 40వేల టన్నుల ఇసుక వినియోగదారులు తీసుకెళ్తున్నారు. వర్షాలు తగ్గాక ఇసుకకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఆ సమయంలో ఇసుక కొరత లేకుండా అందుబాటులో ఉంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఉచిత ఇసుక ప్రారంభం - రూ.6 వేల ట్రాక్టర్ ఇప్పుడు రూ.1500 - Free sand policy begins from today