వనదేవతల జనజాతరకు వేళాయే - నేడు మేడారానికి పగిడిద్దరాజు, జంపన్న పయనం - Medaram Sammakka Saralamma Jatara
Sammakka Saralamma Jatara 2024 : మహాజాతరకు మేడారం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపట్నుంచి నాలుగు రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. గద్దెలపై కొలువు తీరేందుకు పగిడిద్దరాజు డప్పుడోలు వాద్యాల నడుమ కోలాహలంగా మేడారం చేరనున్నాడు. జాతర సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. భక్తుల కోసం యంత్రాంగం అన్ని వసతులు కల్పించింది.
Published : Feb 20, 2024, 7:10 AM IST
Sammakka Saralamma Jatara 2024 : వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు వచ్చే శుభ ఘడియలు వచ్చేశాయ్. జంపన్న వాగు జనసంద్రంగా మారే ఘట్టం సమీపించింది. కీకరాణ్యం జనారణ్యమై కోలాహలంగా మారేది ఇక రేపటి నుంచే. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు ప్రతిబింబింగా నిలిచే తెలంగాణ కుంభమేళా మేడారం(Medaram) మహా జాతర బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మాఘమాసం పౌర్ణమి రోజుల్లో ఏటా రెండేళ్లోకోసారి ఈ జాతర వేడుకగా జరగడం ఆనవాయితీగా వస్తోంది. మండమెలిగే పండుగతో గత బుధవారం జాతరకు అంకురార్పణ జరగ్గా వనం వీడి జనం మధ్యకు వచ్చే వన దేవతల ఆగమనంతో అసలైన మహా జాతర మొదలవుతోంది.
Medaram Jatara 2024 : ఇసకేస్తే రాలనంత జనం జేజేల మధ్య సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజుల ఆగమనం మొదలు కానుంది. బుధవారం నుంచి మొదలయ్యే జాతర కోసం ముందుగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు డప్పు డోలు వాద్యాల నడుమ శివసత్తుల నృత్యాల మధ్య నేడు కోలాహలంగా మేడారానికి బయల్దేరనున్నారు. గుడి నుంచి ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు గ్రామ వీధుల్లో సందడిగా సాగుతుంది. అటవీ మార్గంలో 70 కిలోమీటర్ల మేర కాలినడకన బయలు దేరి రేపు సాయంత్రానికి మేడారానికి విచ్చేస్తారు. ఆ సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరతారు.
వారెవ్వా!! మేడారం వనదేవతల కథను ఎంతబాగా చెప్పారో - ఈపాటలు వింటే గూస్బంప్స్ గ్యారంటీ
జాతర రెండో రోజు గురువారం సమ్మక్క ఆగమనమే. లక్షలాది భక్తుల కోలాహలం నడుమ సమ్మక్క గౌరవంగా గద్దెలపైకి వస్తుంది. జాతర మూడోరోజు దేవతలంతా గద్దెలపై ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శనివారం రాత్రి దేవతలు తిరిగి వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం మహాజాతరకు ముందే 50 లక్షలపైన భక్తులు దేవతలను దర్శించుకున్నారు. దూరప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు లెక్కచేయక తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Medaram Sammakka Saralamma Jatara 2024 : ఆ నాలుగు రోజుల్లో కోటిన్నర నుంచి రెండు కోట్లపైన భక్తులు దర్శించు కోనున్నారు. 110 కోట్ల వ్యయంతో సర్కార్ జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్‌రెడ్డితో కలిసి మేడారం సమక్క సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం నోడల్ అధికారులతో సమావేశమై ఉత్సవాలు జరిగే 4 రోజులపాటు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవ నిర్వహణలో ట్రాఫిక్ నిర్వహణ అత్యంత కీలకమని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరో రెండ్రోజుల్లో మహాజాతర - భక్తులతో జనసంద్రంగా మారనున్న మేడారం
ములుగు గట్టమ్మ తల్లి ఆలయం గేట్‌వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధి కెక్కింది. మేడారం మహా జాతర వేళ గట్టమ్మతల్లి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తల్లిని తనివీతీరా దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని భక్తులు మేడారం పయనమవుతున్నారు. కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచి వరాలిచ్చే శక్తిగా గట్టమ్మ తల్లిని భక్తులు భావిస్తారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను ముందే దర్శించుకున్నంత తృప్తిని భక్తులు పొందుతారు.
మేడారం జాతరకు పెరుగుతున్న భక్తుల రద్దీ - ముందస్తు మొక్కులు సమర్పణ ముమ్మరం
వన దేవతల దర్శనానికి వేళాయే - 'మండమెలిగే'తో మహా జాతరకు సిద్ధమైన మేడారం