Sad Stories Of Children in Marripalem Orphanage : విశాఖ నగరం మర్రిపాలెంలోని శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. ఆ కేంద్ర పరిమితి 10 మంది. కానీ, ప్రస్తుతం 18 మంది చిన్నారులున్నట్లు శిశు సంక్షేమ కమిటీ అధికారులు చెబుతున్నారు. వారిలో 15 మంది తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. అందులో 10 మందికి పైగా ఏడాది లోపు వయసుంటుంది. పాలు తాగే చిన్నారులే ఎక్కువ. అధిక శాతం అనధికార దత్తతలే. టాస్క్‌ఫోర్స్ పోలీసులు పిల్లలను ఇక్కడ అప్పగించిన తర్వాత పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీర్ఘకాలంగా పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తతకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ ప్రక్రియ వేగవంతమయ్యేలా జిల్లా అధికారులు చర్యలు చేపడితే చిన్నారులకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ కేంద్రంలో ఉన్న పలువురు చిన్నారులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒక పాపకు రక్తహీనత, పోలియో తదితర సమస్యలున్నాయి. కొన్ని నెలల నుంచీ అక్కడ వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. గిరిజన ప్రాంతానికి చెందిన ఒకరికి ఏఎన్‌ఎంగా అర్హత లేకున్నా పోస్టింగ్ ఇచ్చారు. ఆమెకు వైద్య పరిజ్ఞానంపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించాలని ఉన్నతాధికారులను కోరినా ప్రయోజనం లేదు. ఇదిలా ఉండగా మరో వైపు పిల్లలకు ఆహారం, మందులు ఇతర అవసరాలకు నెలకు రూ.30 వేలకు పైగా ఖర్చవుతోంది. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో నిర్వాహకులపై భారం పడుతోంది. గతంలో విజయనగరం జిల్లాలో అప్పటి అధికారులు మూల నిధిని పక్కదారి పట్టించారు. దీంతో ఆ నిధులు వినియోగించుకోవడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఓ ఉద్యోగ దంపతులు చిత్తు కాగితాలు ఏరుకునే కుటుంబం నుంచి తొమ్మిది నెలల పాపను కొనుగోలు చేశారు. ఇది చట్టరీత్యా నేరం. కారణమేమైనా కొద్ది రోజులకు చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు 2021 డిసెంబరులో పాపను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. శిశుగృహలో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. దత్తత తీసుకున్న తల్లి పాపపై బెంగతో చనిపోయింది. సొంత తల్లిదండ్రుల వద్ద సరైన ఆధారాలు లేవనే కారణంతో ఇప్పటికీ సీడబ్ల్యూసీ అధికారులు ఆ పాపను అప్పగించలేదు. మూడేళ్లుగా ఆ చిన్నారి శిశుగృహలోనే ఉంది. తగిన చర్యలు తీసుకోవాలని అప్పటి జేసీ విశ్వనాథన్ పోలీసులకు సూచించినా ఎలాంటి ప్రయోజనం లేదు.
మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ తల్లి బిడ్డ ఆలనాపాలనా చూడలేకపోయింది. పుట్టిన 10 రోజులకే బిడ్డను శిశుగృహకు, తల్లిని స్వధార్ గృహానికి తరలించారు. బిడ్డను తల్లి దగ్గరకు చేర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించినా సీడబ్ల్యూసీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తెలిసింది. దీంతో పాప ఆరు నెలలుగా తల్లికి దూరంగా ఉంది.
Orphan baby: అమ్మా నేను భారమా.. ఎందుకీ దూరం..?
'అనకాపల్లి శిశుగృహ 15 రోజుల్లో ఏర్పాటవుతుంది. ఇటీవల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. ప్రారంభించగానే విశాఖ నుంచి కొందరిని అక్కడికి పంపిస్తాం. విజయనగరంలో శిశుగృహ ఉన్నా అక్కడికి పంపేందుకు నిబంధనలు అంగీకరించవు.' -రాధ, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్