Rythu Bheema and Rythu Bandhu Scam : తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ ఘటన మరువక ముందే మరో కుంభకోణం బయటకు వచ్చింది. రైతుబంధు, రైతు బీమా పేరిట వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు అక్రమాలకు తెరలేపి రూ.2 కోట్లు కాజేశారు. అన్నదాతలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరణించిన రైతులకు రైతు బీమా కింద రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా రూ.10,000ల చొప్పున సాయం చేసింది.
Rythu Bheema Scam in Telangana : ఆ పథకంలో లొసుగులను అవకాశంగా మార్చుకున్న రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలానికి చెందిన వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు కుంభకోణానికి తెరలేపారు. ఆ ప్రాంత పరిధిలో కొందరు అన్నదాతల వివరాలు సేకరించిన అధికారులు వారు మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ఆధారంగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసి, సుమారు రూ.కోటి మేర పరిహారం నిధులు స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలింది.
గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో నలుగురు అధికారుల అరెస్ట్
ఎల్‌ఐసీ ఫిర్యాదులో వెలుగులోకి : 20 మంది బతికున్న అన్నదాతలను చంపేసి, 2020 నుంచి అక్రమాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రైతు బీమా (Rythu Bheema) కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. ఆ క్లెయిమ్‌ల చెల్లింపులకు సంబంధించి ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రూ.కోటికి పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఆ విషయంపై ముంబయిలోని ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Rythu Bandhu Scam in Telangana : రైతు బీమా కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే రైతుబంధు (Rythu Bandhu) కింద రూ.కోటి నిధులు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది. అన్నదాతల పేరిట నకిలీ ఖాతాలు తెరవడం, దొడ్డి దారిలో నిధులు కాజేసి జేబులో వేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైతుబంధు సాయం అందాలంటే భూ యజమాని పేరు ధరణిలో నమోదై ఉండటం సహా బ్యాంకు ఖాతా, ఆధార్ అనుసంధానమై ఉండాలి. అంతా పక్కాగా ఉన్నా నిధులు ఎలా మళ్లించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏంటీ! అంబులెన్సులు, ఆటోలు, బైకుల్లో 'గొర్రెల పంపిణీ' చేశారా? - కాగ్ సంచలన రిపోర్ట్
కుంభకోణం వెనుక ఎవరెవరున్నారనే కోణంలో లోతుగా దర్యాప్తు : ఉన్నతాధికారుల కళ్లు గప్పి ఆ నిధులు స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మొత్తం రూ.2 కోట్లు కొట్టేసిన వ్యవహారంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలడంతో అతణ్ని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కొందుర్గు మండలం పరిధిలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను విచారించినట్లు తెలుస్తోంది. అసలు ఆ తతంగం వెనక ఎవరున్నారనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి 'రైతు బీమా' డబ్బుల కోసం కుమారుడి నిర్వాకం.. ఎంతకి తెగించాడంటే..?