Russian Cosmonaut Sergei Korsakov Meet Deputy CM Pawan Kalyan : అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమని తెలిపారు. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గీ కోర్సకొవ్, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కల్యాణ్‌తో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు.
స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు@APDeputyCMO @AndhraPradeshCM @SergKorsakov @SpaceKidzIndia @KesanSrimathy @YagnaYR pic.twitter.com/J92NdjtCav
— JanaSena Party (@JanaSenaParty) August 25, 2024
రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలి : ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్‌ను పవన్ కల్యాణ్‌కు చూపించి దాని పనితనాన్ని వివరించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్జ్ ఇండియా (Space Kidz India) వ్యవస్థాపకురాలు, సీఈవో డా. కేశన్ (CEO Dr. Kesan) కోరారు. స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. అదే స్పేస్ పార్క్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని అన్నారు.
ప్రత్యేకంగా రష్యన్ వంటకాలు తయారు : ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గి కోర్సకొవ్‌ను పవన్ కల్యాణ్ సత్కరించారు. చంద్రయాన్ -3 రాకెట్ నమూనాను బహుకరించారు. సెర్గి ఆరు నెలల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి విశేషాలను, అంత కాలం ఏ విధంగా ఉండగలిగారు, అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్ కల్యాణ్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు. ఈ సమావేశంలో స్పేస్ కిడ్జ్ ఇండియా సీఓఓ వైఆర్ యజ్ఞ, సంస్ధ ప్రతినిధులు ఎస్బీ అర్జునర్, సాయి తన్య పాల్గొన్నారు.