Rural Employment Guarantee Scheme: గ్రామాల్లో ఏ ఆధారం లేని నిరుపేదలు, వయసు ఉడికిపోయిన కూలీల నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తున్నాయంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చలవే. పల్లెల ప్రగతికి బాటలు పరిచి గ్రామీణుల వెతలు తీర్చిన గొప్ప పథకం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం తీసుకొచ్చినా పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాలు దీన్ని కొనసాగించాయి. ఈ పథకాన్ని అత్యుత్తమంగా వినియోగించుకోవడం సహా, పనుల పర్యవేక్షణలో గత తెలుగుదేశం ప్రభుత్వం చూపిన చొరవ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
కూలీలకు అత్యధిక పని దినాలు కల్పించి రికార్డు సృష్టించింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అద్భుత పథకం నీరుగారిపోయింది. పథకం అమలు, పనుల పర్యవేక్షణ పడకేసింది. కూలీ డబ్బుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని కూలీలు ఎదురుచూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పల్లెల్లో ప్రగతి కాంతులను పూయించడంలో ప్రధాన భూమిక పోషించిన ఈ పథకంలో కేంద్రం మంజూరు చేసే నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలి.
గ్రామాల్లో అవసరమైన పనులకు నిధులను కేటాయిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ పనులు త్వరగా పూర్తిచేసి కొత్త పనుల కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపి నిధులు రాబట్టుకోవాలి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. పేదలకు పని కల్పించడంతోపాటు గ్రామాలు అభివృద్ధి చేసుకునేందుకు ఉన్న చక్కటి పథకానికి జగన్ సమాధి కట్టారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో 23,553 కిలోమీటర్ల అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించి 'ఉపాధి' నిధులను విరివిగా వినియోగించుకుంది. జగన్ ప్రభుత్వం మాత్రం గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణ విషయాన్నే విస్మరించింది. అర్థంపర్థం లేని ప్రణాళికలు, ఆచరణ సాధ్యంకాని పనులు, పర్యవేక్షణ లేమితో రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మెటీరియల్ విభాగం నిధులను కొత్త భవనాల నిర్మాణాలకు కేటాయించింది. వాటినైనా పూర్తి చేసిందా అంటే అదీ లేదు.
గడిచిన ఐదేళ్లలో వాటిలో సగం భవనాలు కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. వాటికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికీ పునాదుల దశలోనే మగ్గుతున్నాయి. జగన్ రివర్స్ పాలనలో నిధులు సద్వినియోగం కాకపోగా చేపట్టిన పనులూ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. కూలీలకు సరైన 'ఉపాధి' కల్పించకుండా వారి రెక్కలు విరిచారు. రెండు నెలల వేతనాల చెల్లింపులు నిలిచిపోవడంతో కుటుంబాల పోషణకు వారు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఉపాధి హామీ పథకం చరిత్రలోనే అత్యధికంగా 2018-19లో 9,216 కోట్ల రూపాయలను తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ ఏడాది కూలీలకు 24.64 కోట్ల పని దినాలు కల్పించింది. జాతీయ స్థాయిలో సగటు వేతన రేటు 179.29 రూపాయలు ఉంటే మన రాష్ట్రంలో 199.17 రూపాయలు ఉందని అప్పట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 2నెలలుగా ఉపాది కూలీలకు వేతనాలు లేవు.
కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్: చంద్రబాబు - Chandrababu Tour in Kuppam
దాదాపు రూ.500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేంద్రం కూలీలకు ప్రకటించిన సగటు కనీస వేతనం 272 రూపాయలు కాగా మన రాష్ట్రంలో దక్కింది కేవలం 223.79 రూపాయలు మాత్రమే. మెటీరియల్ నిధులతో కలిపి చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.800 కోట్ల పైమాటే. వైసీపీ పాలనలో కూలీల శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం వారికి లభించడం లేదు. చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.
రోజువారీ వేతనం ఆధారంగా కుటుంబాలు ఈడ్చే కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. పైగా ఈ నెపం మొత్తం కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారు. గతంలో కేంద్రం నుంచి నిధులు రావడంలో ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఆ తర్వాత సర్దుబాటు చేసుకునేది. అస్మదీయులకు రూ.వేల కోట్లు దోచిపెడుతున్న జగన్ పాపం పేద కూలీలకు వేతనాలు మాత్రం ఇవ్వడం లేదు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలుగుదేశం హయాంలో 23వేల 553 కిలోమీటర్ల సిమెంట్ రహదారులు నిర్మిస్తే జగన్ హయాంలో ఐదేళ్లలో కనీసం 5వేల కిలోమీటర్ల కూడా పూర్తి చేయలేకపోయింది. గత ప్రభుత్వ హయాంలో 2,071 పంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టింది. మరో 996 భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు నిలిపివేయడంతో ఎక్కడిక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి.
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తరలించడానికి అనుగుణంగా 718 కోట్లతో 11,253 కి.మీ. రోడ్లను నిర్మించింది. శ్మశాన వాటికల్లో సదుపాయాల కల్పనకు 118 కోట్లు ఖర్చు చేసి 2,251 శ్మశాన వాటికల్లో బావులు, షెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ బుట్టదాఖలయ్యాయి. 9,871 కోట్ల మెటీరియల్ విభాగం నిధులతో 34,586 భవన నిర్మాణ పనులు అట్టహాసంగా ప్రారంభించిన జగన్ ప్రభుత్వం ఐదేళ్లయినా వాటిల్లో సగం కూడా పూర్తి చేయలేదు.
బస్సు యాత్రకు క్షమాపణ యాత్రగా పేరు మార్చుకో- జగన్పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ - CM Jagan bus tour