RTC Planning To Convert Old Buses Into Electric Buses : రాష్ట్రంలో కాలం చెల్లిన బస్సులను కరెంటుతో నడపాలని ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం వీటిని డీజిల్‌తో నడుపుతున్నారు. వీటిలోని ఇంజిన్లను తీసేసి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. పాత బస్సుల్లో బ్యాటరీలు ఏర్పాటు చేసి, కరెంటుతో ఛార్జింగ్ చేసి నడపాలని ప్లాన్ చేస్తుంది. ఇలా మొదట 408 బస్సులను నడపాలని యోచిస్తోంది.
రాష్ట్రంలో కాలం చెల్లిన బస్సులు చాలా మేర నగరాల్లోనే తిరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్‌లలో తిరుగుతున్న వాటిలో అవే ఎక్కువ. ఏడాదికన్నా తక్కువ కాలం తిరిగిన కొత్త బస్సులు రాష్ట్రంలో మొత్తం 712 ఉంటే, అందులో నగరాల్లో ఉన్నవి కేవలం 17. రవాణా శాఖ నిబంధనల మేరకు ఒక వాహనాన్ని 15 ఏళ్ల వరకే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత కూడా నడపడానికి అనుమతి పొందాలంటే వాహనం ఫిట్‌గా ఉన్నట్లు సర్టిఫికెట్ పొందాలి. అదనంగా ఆ బస్సుకు పన్ను చెల్లించాలి. ఇలాంటివి ఉన్న కారణంగా ఆర్టీసీ 15 ఏళ్లు నడిపిన బస్సులను పక్కన పెట్టేస్తోంది.
అయితే రాష్ట్రంలో ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సుల్లేవు. ఉన్న బస్సుల్లోనూ చాలా వరకు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. దీంతో కాలం చెల్లిన వాటిని మరో రూపంలో తీసుకొచ్చేందుకు, ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో 13-14 ఏళ్లు తిరిగిన బస్సులు మొత్తం 832 ఉంటే, అందులో 582 సిటీల్లోనే ఉన్నాయి. 14-15 ఏళ్ల బస్సులు 408 ఉంటే, ఏకంగా కాలం చెల్లిన డొక్కు బస్సులు సిటీ సర్వీసులుగా తిరుగుతున్నాయి.
- ఆర్టీసీలో సొంత బస్సులు మొత్తం 6,424 ఉండగా, వీటిలో 2,450 నగరాల్లో, 3,974 గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్నారు. వీటిలో ఐదేళ్లలోపు తిరిగినవి 1,492, 5-10 ఏళ్ల లోపువి 1,793, 10-15 ఏళ్లవి 3,139 బస్సులు ఉన్నాయి.
- ఆర్టీసీలో మొత్తం 2,726 అద్దె బస్సులు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ బస్సులు 112 ఉండగా అవన్నీ కొత్తవే. హైదరాబాద్‌లో సిటీ సర్వీసులుగా, హైదరాబాద్ - విజయవాడ మధ్య దూర ప్రాంత సర్వీసులుగా ‘ఈ-బస్సులు’ తిప్పుతున్నారు. మిగిలిన అద్దె బస్సులు డీజిల్‌తో నడిచేవి. అద్దె బస్సుల్లో 1-7 ఏళ్లవి 1,914 ఉండగా, 7-10 ఏళ్లవి 812 బస్సులు ఉన్నాయి.
- పాత బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు ప్రతిపాదన రాగా, 15 సంవత్సరాలు దాటుతున్న బస్సులు దాదాపు 500 వరకు ఉన్నాయి. పాత బస్సులకు ఇంజిన్ కిట్ మార్చాలి. ఈ కిట్ ధర చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని నిర్ణయించారు.
వరదల వేళ టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం - ఆ మార్గంలో టికెట్ ధరలపై 10% డిస్కౌంట్