RTC KARMIKA PARISHATH UNION LEADERS MEET CBN: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన రివర్స్ పీఆర్సీ వలన ఆర్టీసీలోని వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం ఆర్టీసీ కార్మిక పరిషత్ కోరింది. ఆర్టీసీ ఉద్యోగులందరూ IR కోసం ఎదురు చూస్తున్నారని వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలని కార్మిక పరిషత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేషగిరిరావు, వై. శ్రీనివాసరావు సీఎం చంద్రబాబును కోరారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్సార్సీపీ సర్కారు సమస్యలు పరిష్కరించకపోగా, మోసం చేసిందని సీఎంకు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు సహా గతంలో ఉన్నట్లుగా అపరిమిత ఉచిత వైద్య సదుపాయం పునరుద్దరించాలని కోరారు. ఆర్టీసీ సిబ్బంది అక్రమ సస్పెన్షన్ల నివారణకు గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన 1/2019 జీవోను వైఎస్సార్సీపీ సర్కారు తీసేసిందని, ఫలితంగా అక్రమ సస్పెన్షన్లతో కష్టాలు పడుతున్నట్లు తెలిపారు. గతంలో తెచ్చిన జీవోను అమలు చేయాలని కోరారు.
ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి సీఎంకు వివరించి పరిష్కరించాలని మెమోరాండం ఇచ్చినట్లు నేతలు తెలిపారు. రవాణా శాఖా మంత్రి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి RTC ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సముచిత న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం కార్మిక పరిషత్ యూనియన్ ద్వారా లక్ష రూపాయలు విరాళం అందించారు.
మరోవైపు వైఎస్సార్సీపీ సర్కారు తప్పిదంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు తెలిపారు. జీవో 114లో అలవెన్సుల ప్రస్తావన చేయకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు లక్షల్లో నష్టపోయారు. సమస్యను పరిష్కరించి ఆర్టీసీ ఉద్యోగులందరికీ అలవెన్సుల మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించినా ఆర్థికశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఫైల్ ముందుకు కదల్లేదు. ఫలితంగా డబ్బులు జమకాక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ప్రజలకు నిరంతరం రవాణా సేవలందిస్తోన్న సిబ్బందికి పలు రకాల అలవెన్సులను ఆర్టీసీ యాజమాన్యం అమలు చేస్తోంది. ప్రభుత్వంలో విలీనం అనంతరం ఈ అలవెన్సులను గత వైఎస్సార్సీపీ సర్కారు తొలగించడంతో, 2020 నుంచి వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లకు నిలిచిపోయాయరని నేతలు స్పష్టం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సులు ఏవీ? - శాపంగా మారిన వైఎస్సార్సీపీ సర్కారు తప్పిదాలు