RTC Employees Suspended in Kakinada: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఘోరంగా పరాజయం పాలవడాన్ని ఓర్చుకోలేక కొందరు ఆర్టీసీ అధికారులు తమ కోపాన్ని ఉద్యోగులపై ప్రదర్శిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై పోరాడిన ఆర్టీసీ యూనియన్ నేతలే లక్ష్యంగా వేటు వేస్తూ కసి తీర్చుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. కాకినాడ బస్ డిపోలో సీనియర్ డ్రైవర్ సహా డ్రైవర్ల యూనియన్ నేత వెంకటేశ్వర్లును కాకినాడ డిపో అధికారులు సస్పెండ్ చేశారు.
గత నెల 19వ తేదీన గుంటూరు నుంచి కాకినాడ వెళ్తుండగా భారీ గాలివానకు సూపర్ లగ్జరీ డ్రైవర్ కేబిన్ సహా బస్సు లోపల పలు చోట్ల నీరు లీకైంది. డ్రైవర్ సహా ప్రయాణికులూ ఇబ్బంది పడ్డారు. బస్సును రోడ్డుపక్కనే ఆపివేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడతారని భావించి, డ్రైవర్ వెంకటేశ్వర్లు తడుస్తూనే డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. దీన్ని వీడియో తీసిన బస్సులోని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
సురక్షితంగా గమ్యాన్ని చేర్చినందుకు డ్రైవర్‌ను అభినందించాల్సిన అధికారులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించారని పది రోజుల క్రితమే బాధ్యతల నుంచి తప్పించారు. తన తప్పేమీ లేదని ప్రయాణికులే వీడియో తీశారని వివరణ ఇచ్చినా పట్టించుకోలేదు. ఎన్నికలు ఫలితాలు విడుదలైన వెంటనే ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ కాకినాడ డిపో మేనేజర్ సస్పెన్షన్ ఆర్డర్‌ను డ్రైవర్ చేతిలో పెట్టి మరీ ఇంటికి పంపారు.
గత ప్రభుత్వ విధానాలపై పోరాడినందుకే లక్ష్యంగా చేసుకుని సస్పెండ్ చేసినట్లు డిపోలోని మిగిలిన డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ సహా జిల్లా డీపీటీవో తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ సస్పెన్షన్ల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని కాకినాడ డిపోలోని ఆర్టీసీ డ్రైవర్లు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాన్ని కోరుతున్నారు.