AP Budget 2024 : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పయ్యావుల కేశవ్, శాసనసమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,94,427.25 కోట్లతో పద్దును ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లు. రెవెన్యూ లోటు రూ. 34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లు. పద్దులో వివిధ కీలక రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు రూ.16,705 కోట్ల నిధులు కేటాయించారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలివేసిందని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్‌కు నష్టం కలిగి ప్రాజెక్ట్ నిర్మాణానికి తీవ్ర జాప్యం చేసిందని విమర్శించారు. వంశధార ఫేజ్-2, హంద్రీనీవా రెండో దశ, వెలిగొండ, తోటపల్లి బ్యారేజ్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పులిచింతల, గుండ్లకమ్మ రిజర్వాయర్, సోమశిల-స్వర్ణముకి లింక్ కెనాల్ వంటి ప్రాజెక్ట్‌ల్లో ఏ ఒక్కదానిలోనూ పురోగతి లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
"పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సలహాలను కూడా లెక్కచేయలేదు. నిర్మాణం కీలకదశలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఏజెన్సీని మార్చారు. డయాఫ్రం వాల్ దెబ్బతిని ప్రాజెక్టు నిర్మాణం తీవ్ర జాప్యమైంది. కూటమి ప్రభుత్వం సాగునీటిరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జలవిధానం. పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత." - నిమ్మల రామానాయుడు, మంత్రి
Nimmala Rama Naidu on Irrigation : చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార రెండోదశ, వెలిగొండ ప్రాజెక్ట్, హంద్రీ నీవా సుజలస్రవంతి ప్రాజెక్ట్, టీబీపీ-హెచ్చెల్సీ వ్యవస్థ మెరుగుదల, చిన్న నీటిపారుదల,వాటర్ షెడ్స్,భూగర్భ జలాల నిర్వహణలతో సహా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. వీటిని పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. భావవాసి చెరువు మార్పిడి ప్రాజెక్ట్ , మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. గోదావరి- పెన్నా, నాగావళి- వంశధార నదులను అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మల పేర్కొన్నారు.
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ - శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
రైతులకు గుడ్‌న్యూస్ - వ్యవసాయ రంగానికి రూ.43,402 కోట్ల కేటాయింపులు