Round Table Meeting : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా విజయవాడలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఉమేష్ చంద్ర ఫౌండేషన్, తక్షశిల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ (School of Politics) పేరుతో ఓ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. పెట్టుబడులు తీసుకువచ్చేందుకు దావోస్‌కు ఎపీ ప్రభుత్వం తరపున కనీసం ప్రాతినిథ్యం వహించకపోవడం సహా, పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించడంలో ప్రభుత్వం విఫలమవడంపై చర్చించారు. పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు పారిపోకుండా కాపాడేందుకు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని పైనా చర్చించారు. దీనికి వైఎస్సార్సీపీ మినహా అన్ని రాజకీయపార్టీలు , ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.
జగన్‌లో చలనం లేదు : గతంలో రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు అనేక సార్లు దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చారని, వైఎస్సార్సీపీ వచ్చాక సీఎం జగన్ కేవలం ఒకే ఒక్క సారి మాత్రమే దావోస్ వెళ్లారని, మూడేళ్లు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. తాజాగా జరిగిన సమ్మిట్‌కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్రాల సీఎంలు వెళ్లగా సీఎం జగన్‌లో మాత్రం కనీస చలనం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం గతంలో ఒక్క ఏడాదిలో తెచ్చిన పెట్టుబడి సైతం జగన్ నాలుగేళ్లలో తేలేక పోయారని ఆరోపించారు. పొరుగున రాష్ట్రాలు పెట్టుబడులు తెస్తోన్న వైనాన్ని చూసైనా సీఎం జగన్ సిగ్గు తెచ్చుకోలేదని ధ్వజమెత్తారు. పరిశ్రమల సమీక్ష పేరిట ఉన్న వాటినీ పంపించేశారని, దావోస్‌లో ఏపీ పరువు తీసే విధంగా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు.
దావోస్ సమ్మిట్‌పై ప్రభుత్వానికి సోయి లేదు - దృష్టంతా రాబోయే ఎన్నికల పైనే
అవాస్తవాలు మానుకుని పెట్టుబడులు తేవడంపై దృష్టి పెట్టండీ : అభివృద్ధి, సంక్షేమం పేరుతో సీఎం జగన్ ప్రజలను దారుణంగా మోసం చేశారని బీజేపీ నేతలు విమర్శించారు. దార్శనికత, భవిష్యత్తుపై ఆలోచన లేని జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక విజన్ లేదని, ప్రచార ఆర్భాటం తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. గతంలో దావోస్‌లో 13లక్షల కోట్లు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారని, ఆ పెట్టుబడి, పరిశ్రమలు ఎటు పోయాయో పాలకులకే తెలియాలన్నారు. ప్రభుత్వం పచ్చి అబద్దాలతో ప్రజలను మోసం చేస్తుందన్న సత్యకుమార్, జగన్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడైనా అవాస్తవాలు మానుకుని పెట్టుబడులు తేవడంపై దృష్టి పెట్టాలన్నారు.
పరిశ్రమలు లేని రాష్ట్రం : ఏపీలో పెట్టుబడి పెట్టడానికి అనేక అంశాలు అనుకూలంగా ఉన్నా వాటిని సద్వినియోగం చేసి ఆకర్షించడంలొ జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నేత తులసీరెడ్డి ధ్వజమెత్తారు. హోదా, విభజన హామీలు, అమలైతే పరిశ్రమలు తరలి వచ్చేవని వాటి కోసం సీఎం జగన్ కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అమర్ రాజా వంటి ఉన్న కంపెనీ లే మూత పడేలా చేశారని, దీనివల్లే నేడు పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఉందన్నారు. మూడు రాజధానులనడంతో అనిశ్చితి పరిస్థితి ఏర్పడి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు.
విశాఖ సమ్మిట్‌తో భారీగా పెట్టుబడులు వచ్చాయంటూ మోసం చేస్తున్నారు: సత్యకుమార్
యువతరం వలస : అభివృధ్ధిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా తిరోగమనంలో ఉందని దీనికి సీఎం జగన్ వైఖరే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న వే ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం వచ్చిందన్నారు. పొరుగు రాష్ట్రంలోని తెలంగాణా సీఎం దావోస్ వెళ్లి మరీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంటే సీఎం జగన్ మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంతో ఉన్నారని, తన పార్టీ ఎమ్మెల్యేలను బదిలీ చేసే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. రాక్షస పాలన చేస్తూ వేధింపులకు పాల్పడి అమర్ రాజా వంటి సంస్థను తరిమేశారని, ఇలాంటి ప్రభుత్వాన్ని మార్చాలి. ఇటువంటి వాళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రానికి ఎవరొస్తారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నేడు ఏపీలో పరిశ్రమలు రాకుండా పోయాయని, ప్రతిభ ఉన్న యువతరం పొట్ట చేత పట్టుకుని వలస పోతుతున్న దుస్ధితి ఉందని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వాహకుడు, హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అప్రమత్తంగా ఉండాలి : పెట్టుబడులను తీసుకురావడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు వాస్తవాలను గుర్తించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలు రంగాల మేథావులు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా అప్రమత్తం కావాలని సూచించారు.