Rotary Club The Hand Project Helpful For No Hand people: ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారికి జర్మనీకి చెందిన 'ది హ్యాండ్' ప్రాజెక్ట్ చేయూత నందిస్తోంది. రోటరీ క్లబ్ సమన్వయంతో కృత్రిమ చేతులు అమర్చి వారికి కొత్త జీవితం ఇస్తోంది. కృత్రిమ చేయి అంటే ఓ ప్లాస్టిక్ పరికరంలా కాకుండా తినటం, రాయటంతో పాటు మరికొన్ని పనులు చేసేలా రోబోటిక్ తరహా ఉపకరణాన్ని అమరుస్తున్నారు. ఈ కృత్రిమ చేతిని ఉపయోగించటం ద్వారా ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నారు.
వీరంతా వేర్వేరు ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన బాధితులు. రెండు చేతులు సక్రమంగా ఉంటేనే ఉపాధి మార్గాలు లేని ఈ రోజుల్లో ఇలా చేతులు కోల్పోయిన వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. సొంతగా జీవించటం అటుంచి తమ పనులు కూడా చేసుకోలేరు. ప్రతి దానికి వారు కుటుంబసభ్యులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి వారికి జర్మనీకి చెందిన ది హ్యాండ్ ప్రాజెక్ట్ అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన కృత్రిమ చేతుల్ని అమరుస్తోంది. రోటరీ క్లబ్ తరపున గతంలో కూడా ఇలా కృత్రిమ చేతులు అమర్చారు.
అయితే అప్పుడు కేవలం మోచేయి కింది భాగం వరకూ తెగిన వారికి మాత్రమే కృత్రిమ ఉపకరణాలు అందించారు. ఈసారి మాత్రం భుజం వరకూ చేయి కోల్పోయిన వారికి సైతం అందించే కార్యక్రమం చేపట్టారు. మన దేశంలో మొదటిసారి ఈ తరహా ప్రాజెక్టుని ఉచితంగా చేపట్టినట్లు రోటరీ ప్రతినిధులు తెలిపారు. ఈ చేతుల ద్వారా వాళ్లు కొన్ని రకాల పనులు కూడా చేసుకోగలుగుతారు. థర్మో ప్లాస్టిక్‌తో రూపొందించిన ఈ ఉపకరణం చాలా తేలికగా ఉంటుంది. అలాగే వీరికి తెగిన చేయి ఆకృతికి తగ్గట్లుగా రోబోటిక్ చేయిని రూపొందించి ఇస్తారు.
నిస్సహాయులకు సాయంగా.. కృత్రిమ అవయవాల శిబిరం!
జర్మనీకి చెందిన క్రిస్ హెలీ వివిధ దేశాల్లో ఈ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో రోటరీ క్లబ్ సాయంతో కార్యక్రమాలు చేపట్టారు. చేతులు కోల్పోయిన 300 మందికి పైగా బాధితులకు ఉచితంగా ఈ కృత్రిమ పరికరాల్ని అందజేస్తున్నారు. ఒక్కో చేయి ఖరీదు లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకూ ఉంటుంది. కానీ వీటిని ఉచితంగానే 'ది హ్యాండ్' ప్రాజెక్ట్ అందిస్తోంది. వివిధ దేశాల్లో ఇప్పటి వరకూ సుమారు 4వేల మందికి ఈ తరహా చేతులు అమర్చినట్లు ది హ్యాండ్ ప్రాజెక్టు వ్యవస్థాపకుడు క్రిస్ హెలీ తెలిపారు. టాంజానియాకు చెందిన వెరోనికా కిడామి 2020లో ఇంట్లో జరిగిన గొడవలో చేయి పోగొట్టుకుంది. ది హ్యాండ్ ప్రాజెక్టు 2022లో ఆమెకు ఉచితంగా చేయి అమర్చింది. ప్రస్తుతం ఆమె కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులై వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు.
ప్రజలకు సుదీర్ఘ ఆయుష్షుతో పాటు మెరుగైన, గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడమే హ్యాండ్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. హ్యాండ్ ప్రాజెక్టును చాలా గర్వంగా భావిస్తున్నా. ఇది చాలా ఉపయోగపడటంతో పాటు నాలో నమ్మకాన్ని పెంచింది. కృత్రిమ చేతి పరికరాలు అందజేసిన దాతలకు, ప్రాజెక్టు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. - వెరోనికా కిడామి, టాంజానియా
తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఈ కృత్రిమ చేతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారం రోజుల పాటు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి వారందరికీ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృత్రిమ చేతులు అమరుస్తున్నా ఇలా కదిలేలా, పనులు చేసుకునేలా మాత్రం ఉండటం లేదు. జర్మన్ సాంకేతికతతో రూపొందించిన ఈ ఉపకరణాలు ఆ ఇబ్బందిని అధిగమించి చేతులకు కొంత ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.
రోటరీ క్లబ్ సంస్థ సేవలు అభినందనీయం: జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్