Road Accidents in Andhra Pradesh Today: రాష్ట్రంలో శనివారం నాడు వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడప నుంచి ఇతియోస్ కారులో రాయచోటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కడపలో మద్యం సేవించి స్నేహితులంతా ఒకే కారులో రాయచోటికి వస్తుండగా కొండవాండ్లపల్లె వద్దకు రాగానే ముందుగా వెళుతున్న ట్యాంకర్ను వెనక వైపు నుంచి కారు ఢీకొనడం వల్ల కారు నుజ్జునుజ్జయింది ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. ప్రమాదంలో కడపకు చెందిన అంజి నాయక్ (29), షేక్ అలీమ్ (32), జితేంద్ర (22), షేక్ అఫ్రోజ్ (30) మృతి చెందిన వారిలో ఉన్నారు తీవ్రంగా గాయపడిన షేక్ ఖాదర్ బాషా (20) రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై రామాపురం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పల్నాడు జిల్లాలో చెట్టును ఢీకొట్టిన కారు - ముగ్గురు మృతి - Road accident in Palnadu district
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిక వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా పెనుగొండ నుండి రామేశ్వరం తీర్థ యాత్రలకు 52 మందితో వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 21 మందికి గాయాలు అయ్యాయి. మృతులు అనంతపురం జిల్లా రోడ్డం మండలం చింగులపల్లికి చెందిన రామాంజనమ్మ, కర్ణాటక రాష్ట్రం తుంకుర్ జిల్లా మురారిహల్లి కి చెందిన నరసింహా రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.