Road Accident in Mahabubnagar : తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారి-44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు. ఎస్ఐ వెంకట రమణ తన కూతురు, అల్లుడితో కలిసి హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్ సాయి, డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూతురు అనూష తీవ్ర గాయాలయ్యాయి. అనూషను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Road Accident in Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ వద్ద 44వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నవవరుడు ఉండగా నవవధువు గాయాలపాలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ప్యాపిలి సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ కూతురు అనూషాకు హైదరాబాద్ సమీపంలోని మణికొండకు చెందిన పవన్ సాయితో(27) ఈనెల 15న వివాహం జరిగింది.
Mahabubnagar Road Accident : ఈ క్రమంలో హైదరాబాద్‌లో కార్యక్రమాలను ముగించుకొని కారులో అనంతపురం జిల్లాకు నవ దంపతులతో పాటు వెంకటరమణ తిరుగు ప్రయాణం అయ్యారు. అన్నసాగర్ గ్రామ సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బలంగా చెట్టును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న వెంకటరమణ (57), అల్లుడు పవన్‌సాయి(27), డ్రైవర్ చంద్ర (25)అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు అనూషాకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident In Gajwel : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు విద్యార్థులు గజ్వేల్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ అడిగి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.
గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తూ వసతి గృహంలో ఉంటున్న దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బంగారం కు చెందిన గడ్డమీది అరుణ్ (20) అతని స్నేహితునితో కలిసి ఇవాళ ఉదయం 10 గంటలకు కళాశాల నుంచి గజ్వేల్ కు వెళ్లేందుకు రహదారిపైకి వచ్చారు. సంగాపూర్ నుంచి గజ్వేల్ కు వెళ్తున్న గౌరారంకు చెందిన అయాన్ (19) ద్విచక్ర వాహనాన్ని లిఫ్ట్ అడిగి ఆ ఇద్దరు విద్యార్థులు అయాన్ వాహనంపై వెళ్తున్నారు.
మార్గమధ్యలో బాలికల ఎడ్యుకేషన్ హబ్ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గౌరారంకు చెందిన అయాన్ ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.