Road Accident In Hyderabad : హైదరాబాద్‌లోని శంషాబాద్ పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్‌పై టయోటా క్రూజర్ కారు తూప్రాన్ కారును అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో తూప్రాన్ కారులో ఉన్న ఒక మహిళ, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి : తుక్కుగూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Road Accident In Jogulamba Gadwal : మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఈతాండ్రపాడు గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి వెళ్తుండగా అలంపూర్ చౌరస్తా సిద్ధి వినాయక పత్తి మిల్లు సమీపంలో 44వ జాతీయ రహదారిపై వెళుతున్న ఆటోను కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ వెనుక వైపు నుంచి ఢీకొంది.
ఇద్దరు మహిళ కూలీలు మృతి : ఈ ప్రమాదంలో లక్ష్మిదేవి అనే మహిళ అక్కడకక్కడే మృతి చెందగా మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ తాండ్రపాడు గ్రామానికి చెందిన మొత్తం 16 మంది మహిళలు ఆటోలో కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.