Demolition Drive in Mahabubnagar : మహబూబ్‌నగర్‌లోని సర్వే నెంబర్ 523లో సర్కారు భూముల ఆక్రమణలపై ఎట్టకేలకు ప్రభుత్వాధికారులు కొరడా ఝళిపించారు. సర్వే నెంబర్ 523లో 83 ఎకరాల 28 గుంటల భూమి ఉంది. అందులో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు భూములు పంచగా 3 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమి మిగిలి ఉంది. ఈ భూమి ఆక్రమణలకు గురవుతోందని చాలా కాలంగా ఆరోపణలున్నాయి.
70కి పైగా తాత్కాలిక నిర్మాణాలు కూల్చివేత : ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని, దళారులు సర్కారు భూములమ్మి సొమ్ము చేసుకుంటున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారుల బృందం వచ్చి అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేశారు. పట్టాలేకుండా, ఉద్దేశపూర్వంగా ఏర్పాటు చేసుకున్న సుమారు 70కిపైగా తాత్కాలిక నిర్మాణాలను నేలమట్టం చేశామని మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్ ఘన్సీరాం తెలిపారు.
"కొంతమంది మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసుకోమని డబ్బులు తీసుకొని అమ్మడం లాంటివి చేశారని మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆ వ్యవహారంలో ఎవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు వస్తే అర్హత అనుగుణంగా ప్రజలకు అధికారులమే తెలియజేస్తాం. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని కోరుతున్నాం"- ఘన్సీరాం , మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్
ఆవేదన వ్యక్తం చేసిన దివ్యాంగులు : పట్టాలుండీ, అర్హులైన వారి ఇళ్లను సైతం కూల్చి వేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 523లో కొంతమంది దివ్యాంగులకు గత ప్రభుత్వం పట్టాలిచ్చిందని తమ భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే వాటిని కూడా కూల్చేశారని దివ్యాంగులు ఆరోపించారు. 'మా దివ్యాంగుల నిర్మాణాల కూల్చివేత దారుణం. మేము అక్కడ ఇక్కడా అప్పో సప్పో చేసి కట్టిన ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఇంటి పన్ను, నల్లా బిల్లు అన్ని ఉన్నా ఎందుకు కూల్చివేశారో అర్థం కావట్లేదు' అని దివ్యాంగులు వాపోయారు.
నిరుపేదలు, దివ్యాంగుల ఇళ్లు కూల్చివేత దారుణం : అక్రమ నిర్మాణాల పేరుతో నిరుపేదలు, దళితులు, దివ్యాంగుల ఇళ్లు కూల్చడమేంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బాధితులను ఆయన పరామర్శించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బాధితులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు. 523లో ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వ భూమి అమ్మి సొమ్ము చేసుకుంటున్న దళారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు చాలాకాలంగా ఉన్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంపై ఓ వైపు హర్షం వ్యక్తం అవుతుండగా దివ్యాంగుల ఇళ్లు కూల్చడంపై మరోవైపు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - అన్యాయం జరిగిందన్న బాధితులు
మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణదారులకు షాక్ - ఆరు విల్లాలు కూల్చివేత