GHMC Expansion to Outer Ring Road : ప్రధాన నగరం, శివారు ప్రాంతం అనే వ్యత్యాసం కనిపించకుండా రాజధానిని ఓఆర్‌ఆర్ వరకూ విస్తరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ అనే హద్దులను తొలగించేందుకు చర్యలకు ఉపక్రిస్తుంది. రింగు రోడ్డు లోపల ఉన్నదంతా హైదరాబాద్ మహానగరమే అనేలా చేయనుంది. అక్కడి వరకు బృహత్తర ప్రణాళికను రూపొందించి, రోడ్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తుంది. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అధికార యంత్రాంగం ప్రాథమిక ప్రణాళికను సిద్ధం చేశారు. 2026 నాటికి విశాల నగరాన్ని ఆవిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
నగరాన్ని ఎలా విస్తరిస్తారంటే: జీహెచ్‌ఎంసీ ప్రస్తుత విస్తీర్ణం 650చ.కి.మీ. జీహెచ్‌ఎంసీని ఓఆర్‌ఆర్ వరకు విస్తరిస్తే 2200చ.కి.మీ అవుతుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 27 మున్సిపాలిటీలతో పాటుగా నగరపాలక సంస్థలు, 33 గ్రామ పంచాయతీలు, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. ఇన్ని రకాల పాలనలు ఉండటం వల్ల సమన్వయం లోపించి, నగరాభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగట్లేదని ప్రభుత్వం అభిప్రాయ పడుతుంది. ఓఆర్‌ఆర్ హద్దుగా ఒకే నగరానికి శ్రీకారం చుట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అధికారం చేపట్టిన మొదటి వారంలోనే పురపాలకశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ, జలమండలి, మూసీ నది అభివృద్ధి సంస్థ, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు అందుకు సంబంధించి ప్రణాళికను ఓ కొలిక్కి తెచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా నిపుణులతో మరోమారు క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.
‘చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండాలంటే స్థానిక సంస్థల గడువు ముగిశాక ప్రత్యేక అధికారుల సమ్మతి తీసుకుని విలీన ప్రక్రియను సులువుగా పూర్తి చేయవచ్చు. అప్పుడు జీహెచ్‌ఎంసీ పాలకమండలిని మాత్రమే ఒప్పించాల్సి ఉంటుంది. గ్రేటర్ పాలకమండలి సమావేశంలో విలీన ప్రక్రియను ప్రవేశపెట్టి, సభ్యుల నిర్ణయాన్ని జీహెచ్‌ఎంసీ సర్కారుకు అందజేస్తుంది. అనంతరం సర్కారు తదుపరి కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది.’అని కమిటీలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
- ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న గ్రామాలకు తిరిగి ఎన్నిక నిర్వహించకుండా, కార్పొరేషన్ల కాలం ముగిసే వరకు వేచి చూడాలనుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత గ్రామాలు, ఇతర స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని అధికారులు నివేదికలో తెలిపారు.
- ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రామాలు జీహెచ్‌ఎంసీలో విలీన ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని డివిజన్లను పెంచాలనే కసరత్తు తర్వాత జరుగుతుంది. జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం కింద మొత్తం ఆరు జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉన్నాయి. భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను దృష్టిలో పెట్టుకొని డివిజన్లు, సర్కిళ్లు, జోన్ల హద్దులను నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఓఆర్‌ఆర్ లోపలి నగరాన్ని ఒక కార్పొరేషన్‌గా ఉంచాలా, పలు భాగాలుగా చేయాలా అనే అంశంపై చర్చ జరుగుతంది.
జీహెచ్‌ఎంసీ, జలమండలికీ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి : కిషన్ రెడ్డి - Kishan Reddy wants funds to GHMC