Returnable Plots Registration Process Speed Up in Capital Area in AP : రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. వాటిల్లో కొందరు రిజిస్ట్రేషన్ చేయించుకోగా మరికొందరు వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వారంతా ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఆర్డీఏ (CRDA) అధికారులు సాంకేతిక కారణాలను సాకుగా చూపి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఇబ్బందులు పెట్టినట్లు రైతులు వాపోయారు.
జగన్ పాలనలో చుక్కలే : రిజిస్ట్రేషన్ల కోసం తీసుకొచ్చిన కార్డు 2.0 విధానంతో రైతుల సమస్యలు రెట్టింపయ్యాయి. భూమికి సంబంధించిన పత్రాలు, అసలు డాక్యుమెంటు ఉండాలన్న షరతులతో రైతులను గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. రైతుల భూముల సమీకరణలో ఇవ్వడంతో రెవెన్యూ ఆఫీస్‌ల్లో వాటికి సంబంధించిన రికార్డులను అప్‌గ్రేడ్ చేయలేదు. దీంతో డిజిటల్ సంతకాలు, సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
వీటిని తప్పనిసరిగా రెవెన్యూ ఆఫీస్‌ల్లో సరిచేసుకోవాల్సిన పరిస్థితి రాజధాని రైతులకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటు సీఆర్డీఏ కార్యాలయాలు, అటు తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సరళతరం చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి నిర్మాణం స్పీడప్ - ప్రతి సెంటు భూమి తీసుకోవాలని నిర్ణయం - Capital Amaravati Construction
నిబంధనల సరళీకరణతో ఊరట : గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం అనంతవరం, తుళ్లూరు, మందడం, మంగళగిరిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎత్తివేసి సిబ్బందిని కుదించింది. అలాగే రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి పత్రాలను సరిచూసుకోవాలన్న నిబంధన ప్రతిబంధకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నిబంధనను తొలగించింది.
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేక ఇబ్బందులకు గురి చేసింది. అప్పట్లో సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ అనేక సార్లు తిరిగినా పని కాలేదు. ఇప్పుడు సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. చాలా సంతోషంగా ఉంది - అమరావతి రైతులు
రాజధానికి కేంద్రం స్పెషల్ అసిస్టెన్స్ - తొలి విడతగా రూ.15 వందల కోట్లు విడుదల - Capital Investment
2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసినట్లుగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో 15 వేల రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉండటంతో వాటిని వంద రోజుల్లో పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని సైతం ప్రభుత్వం కేటాయించింది. అయితే కొందరు సిబ్బందిలో ఇంకా పాత వాసనలు పోలేదని రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం తుళ్లూరు, మందడంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా వీటికి తోడు మరికొన్ని గ్రామాల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
పర్యాటక హబ్‌గా అమరావతి - రూ. 500 కోట్లతో ప్రణాళికలు - Amaravati Tourism Development