Dancer Yamini Krishnamurthy Passed Away: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. వయోభారం సమస్యలతో బాధపడుతున్న ఆమె, దిల్లీలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1940లో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జన్మించిన ఆమె, భరతనాట్యం, కూచిపూడిలో విశేష ప్రతిభ కనబరిచారు.
ఐదేళ్ల వయసులోనే చెన్నైలోని కళాక్షేత్ర స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌లో భరతనాట్యం శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1957లో మద్రాస్‌లో తొలి ప్రదర్శన ఇచ్చిన ఆమె తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తన ప్రతిభతో టీటీడీ ఆస్థాన నర్తకిగా ఎదిగారు. భరతనాట్యంలో విశేష ప్రావీణ్యం సంపాదించిన తర్వాత కూచిపూడిలోనూ రాణించారు.
శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకొన్నారు. యామినీ కృష్ణమూర్తిని 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. యామినీ కృష్ణమూర్తి ఎంతోమంది ఔత్సాహిక యువతులకు నాట్యంలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దారు. దిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో పుస్తకం రచించారు.
క్షీరసాగరమధనంలో మోహినీగా, భామాకలాపంలో సత్యభామ, ఉషాపరిణయంలో ఉషగా, శశిరేఖాపరిణయంలో శశిరేఖగా ఎన్నో నృత్యరూపకాల్లో పలు పాత్రలను పోషించిన యామినీ కృష్ణమూర్తి, ఎంతోమంది ప్రశంసలు అందుకొన్నారు. సత్యభామగా ఆమెను తప్ప మరొకరని ఊహించకోలేనంతగా కూచిపూడి కళారూపానికి ఆమె గుర్తింపు తీసుకొచ్చారు. ఆమె కేవలం నర్తకి మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి. శాస్త్రీయగానం, వీణవాయిద్యంలోనూ తర్ఫీదుపొందారు.
సీఎం చంద్రబాబు సంతాపం: భారత దేశం గర్వించదగిన నృత్యకారిణి, పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి దిల్లీ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని తెలిసి సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 1940లో మదనపల్లెలో జన్మించిన ఆమె టీటీడీ ఆస్థాన నర్తకిగా పని చేశారని గుర్తుచేసుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె నిష్ణాతురాలని కొనియడారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టింది కూడా యామినీ కృష్ణమూర్తి అని అన్నారు. ఆమె లేని లోటు నృత్య కళా రంగంలో ఎవరూ తీర్చలేరన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
భారత దేశం గర్వించదగిన నృత్యకారిణి, పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్రమైన ఆవేదన చెందాను. 1940లో మదనపల్లెలో జన్మించిన ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన నర్తకిగా పని చేశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో ఆమె… pic.twitter.com/t5K6qiGHO5
— N Chandrababu Naidu (@ncbn) August 3, 2024