RBK Employees Rice Millers Cheating Paddy Farmers: ఖరీఫ్ ధాన్యం విక్రయం వేళ ప్రభుత్వ విధానాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఆర్బీకేల (Rythu Bharosa Kendram) ద్వారా ధాన్యం సేకరణ ప్రహసనంగా మారిందని కృష్ణా జిల్లా రైతులు వాపోతున్నారు. వడ్లు కొనుగోలు కోసం ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడు తీసుకుంటారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం తెచ్చినా నిబంధనల పేరుతో జాప్యం చేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీకే వద్దే నిర్ణయించిన ధరనే ప్రమాణికంగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నా మిల్లర్లు ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారని వాపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైస్ మిల్లర్ల మ్యాపింగ్ విషయంలో చోటు చేసుకుంటున్న అస్తవ్యస్థ విధానాల వల్ల అన్నదాతలు నష్టపోతున్నారు. సమీపంలోని రైస్ మిల్లులకు కాకుండా 10 నుంచి 15 కిలో మీటర్ల దూరం ఉన్న మిల్లుల పేరుతో ట్రక్ షీట్లు వస్తుండడంతో అదనపు కిరాయి భారాన్ని రైతులే భరిస్తున్నారు.
భారంగా మారుతున్న రైతు భరోసా కేంద్రాలు
గతంలో ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించి తర్వాత ఆన్లైన్లో నమోదు చేసేవారు. మిల్లరుకు, రైతుకు మధ్య అవగాహనతో తేమ శాతం మేరకు తగ్గించి ఇచ్చేవారు. ప్రస్తుతం ఆన్లైన్‌లో మిల్లును ట్యాగ్ చేస్తున్నారు. మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత ధాన్యం వద్దని యజమాని అంటున్నారని, తిరిగి మళ్లీ దాన్ని ఇంటికి తీసుకెళ్లలేక వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తేమ శాతం, గన్ని సంచుల పేరుతో క్వింటాకు రెండున్నర కేజీలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా నుంచి ధాన్యం తరలింపునకు ఇతర జిల్లాలకు నిబంధనలు వర్తించడం లేదు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ధాన్యం తరలిస్తున్నారు. తమ గ్రామాలకు పక్కనే ఉన్న మిల్లు వదిలి ఇతర జిల్లాలకు పంపడం వెనుక అంతర్యం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
rythu bharosa kendram: చెప్పేవన్నీ గొప్పులు.. ఆర్బీకేల్లో రైతులకు అందని సేవలు
"ఆర్బీకేలు నిర్ణయించిన ధరను మిల్లర్లు అంగీకరించడం లేదు. కేవలం ఆన్లైన్లోనే అంటున్నారు. ఆఫ్లైన్ తీసుకోవడం లేదు. అసలు ఏ రైతులు కూడా పూర్తిగా డబ్బులు రావడం లేదు. ఎంతో కొంత కట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం ధరను నిర్ణయించడం ఎందుకు". - కృష్ణ, రైతు
"పంట నూర్చి పదిహేను రోజులు అయినా సరే వాటిని అలా సంచులలో ప్యాక్ చేసుకుని, వాటిని పెట్టుకుని ఉండాలి. ఆన్లైన్ అవ్వడం లేదు. ఆఫ్లైన్ ఇవ్వమని అడిగనా ఇవ్వడం లేదు. ప్రభుత్వం మాటలు చెబుతోంది కానీ మిల్లర్లపైన చర్యలు లేవు. ఏ మిల్లర్లతో మాట్లాడింది లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. వాళ్లకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ రైతులను ఏడిపిస్తున్నారు". - వీరమాచనేని శివప్రసాద్, రైతు
దొరికితేనే దొంగలు.. లేదంటే మంచివాళ్లే.. ఆర్బీకే, మిల్లర్ల తీరు