RBI Response on Regional Office Establishment: మూడు రాజధానుల పేరుతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన గందరగోళంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌కి రావడం లేదు. టీడీపీ హయాంలో అమరావతిలో వాటికి భూములు కేటాయించినా, రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న జగన్నాటకంతో ఇప్పటికీ ఆ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం లేదు.
రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోని కారణంగా అమరావతిలో తమ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేకపోతున్నామని ఆర్బీఐ (Reserve Bank of India) తాజాగా స్పష్టం చేయడమే ఇందుకు నిదర్శనం. రాజధాని విషయం తేలనందునే కార్యాలయం ఏర్పాటు చేయలేదని ఏఐపీపీ (All India Panchayat Parishad) జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులుకి పంపిన లేఖలో ఆర్బీఐ స్పష్టం చేసింది.
జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పటికే రాష్ట్రానికి తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడం లేదు. ఉన్నవి సైతం ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా తమ కార్యాలయాల ఏర్పాటు చేయడానికి వెనుకడుగు వేస్తున్నాయంటే రాష్ట్రంలో దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జగన్‌కు అమరావతిపై తగ్గని కసి - మరింత దెబ్బతీసేందుకు ప్రణాళికలు
అమరావతిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వం 2016 డిసెంబరు 1వ తేదీన 11 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకు కేటాయించినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. దీంతో రాష్ట్రానికి చెందిన బ్యాంకులు హైదరాబాద్‌లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం నుంచి నగదు తీసుకునివచ్చి తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి.
దీని కారణంగా నిత్యం వ్యయ ప్రయాసల పడాల్సివస్తోంది. ఈ వ్యవహారంపై బ్యాంకర్లలో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జాస్తి వీరాంజనేయులు ఈ సంవత్సరం జనవరి 12వ తేదీన దిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో స్వయంగా లేఖ ఇచ్చారు. దీనిపై స్పందించిన పీఎం కార్యాలయం ఇందుకు సంబంధించిన వివరాలు పంపాలని ఆర్బీఐని ఆదేశించింది.
లేఖ ఇచ్చిన వీరాంజనేయులుకు కూడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటులో జాప్యానికి కారణాలు తెలియజేయాలంటూ సూచించింది. ఈ మేరకు ఏఐపీపీ ఉపాధ్యక్షుడికి ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుమిత్ రాసిన సమాధాన లేఖలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోని కారణంగానే ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేకపోయామని స్పష్టంగా తెలిపారు.
జగన్నాటకంలో ఇదొకటే కాదు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం అమరావతిలో భూములు తీసుకుని ఇప్పటికీ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని అమరావతిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జాస్తి వీరాంజనేయులు కోరారు.
అమరావతి విఛ్చిన్నమే అజెండాగా జగన్ సర్కార్ కుట్రలు - భూసేకరణ ప్రకటన ఉపసంహరణ