Two Rare Frogs in the Eastern Ghats of Andhra Pradesh : పర్యావరణ వ్యవస్థ మానవ మనుగడకు సూచిక. అది బాగుంటేనే ప్రకృతి కాని జీవవైవిధ్యం కాని విరాజిల్లుతుంది. దానికి జీవుల తోడ్పాటు ఎంతో అవసరం. అందులోనూ సకశేరుకాలు, ఉభయచర జీవులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జీవ మనుగడలో వీటి పాత్ర చాలా ముఖ‌్యమైంది. అలాంటివి ఈ భూమిపై ఎన్నో ఉన్నాయి. కొన్ని పర్యావరణ మార్పుల వల్ల అంతరించిపోతుంటే మరికొన్ని చాలా అరుదుగా కన్పిస్తుంటాయి.
అలాంటి అరుదైన ఒక ఉభయచర జీవిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇటీవలి కాలంలో తూర్పు కనుమల్లో ఉభయచర జీవులపై అధ్యయనాలు, పరిశోధనలు విస్తృతంగా సాగుతోన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారత్‌లో వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్లీస్టోసీన్ కాలంలో శ్రీలంక నుంచి తూర్పు కనుమలకు ఉభయచరాలు వలస వచ్చినట్టు పరిశోధనలు చెబుతున్నాయి.
అరుదైన కప్పలు గుర్తింపు : వీటిని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో గోధుమ చెవుల పొద కప్ప సూడోఫిలౌటస్ రేజియస్ అనే అరుదైన కప్ప జాతిని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో గౌనితిమ్మేపల్లి వద్ద ఓ కుంటలో శ్రీలంక గోల్డెన్ బ్యాక్ట్ ఫ్రాగ్ రానా గ్రాసిలీస్ అనే మరో కప్పలను గుర్తించారు. హైదరాబాద్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్ సభ్యులతో కలిసి వీటిని కనుగొన్నారు.
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా చక్కటి పర్యావరణం, జీవవైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది తూర్పు కనుమలు. అలాంటి ప్రాంతంలో పాలిమార్ఫిక్ శ్రీలంక బ్రౌన్ ఇయర్డ్ ష్రబ్ ఫ్రాగ్, శ్రీలంక గోల్డెన్ బ్యాక్ట్ ఫ్రాగ్‌ను కనుగొన్నారు. వీటిని హైదరాబాద్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా -జెడ్ఎస్ఐ కార్యాలయానికి తీసుకొచ్చి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. తూర్పు కనుమలలో శ్రీలంక సూడోఫిలౌటస్ రేజియస్ గుర్తించడంపై అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన న్యూజిలాండ్ జర్నల్ జూటాక్సాలో కూడా ఆర్టికల్ ప్రచురితమైంది.
తూర్పు కనుమల్లో పర్యావరణం మెరుగు : దేశంలో అంతగా తెలియని సకశేరుకాలు వెంట వెంటనే బయటపడుతుండటం అది కూడా తూర్పు కనుమల్లో బయటపడటం శాస్త్రవేత్తలను ఆనందానికి గురి చేస్తుంది. ముఖ్యంగా హియాలయాలు, పశ్చిమ కనుమల్లోనే ఎక్కువగా జీవజాలానికి సంబంధించి అధ్యయనాలు పరిశోధనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటిది తూర్పుకనుమల్లో ఇలాంటి కప్పలు బయటపడటం అంటే, పర్యావరణం ఇక్కడ కూడా బాగుండటమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా ఇవి కాలుష్యం లేని ప్రాంతాల్లో మాత్రమే మనుగడ సాగిస్తాయని అంటున్నారు.
ప్లీస్టోసీన్ కాలంలో భారత్, శ్రీలంక కలిసే ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. వీటి మధ్యలో భూమార్గం, అటవీ మార్గాలు ఉండేవని అంటున్నారు. ప్రస్తుతం కనుగొన్న శ్రీలంక పొద కప్ప 2005లో శ్రీలంకలో గుర్తించారు. ఇది ఆ దేశ అడవుల్లో ఒక సాధారణ కప్ప. అలాంటిది రెండు దశాబ్దాల వ్యవధి తర్వాత తూర్పు కనుమలలో అది కూడా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో బయటపడటం ప్లీస్టోసీన్ కాలాన్ని గుర్తు చేస్తుందని అంటున్నారు. ఇదే శ్రీలంక పొద కప్పకు సంబంధించి మూడు జాతులు పశ్చిమ కనుమలలో గుర్తించారు. తిరిగి 220 ఏళ్లకు పైగా సమయం తర్వాత బ్రౌన్ ఇయర్డ్ ష్రబ్ ఫ్రాగ్ జాతి బయటపడింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీలంక 75 జాతుల వైవిధ్యమైన సూడోఫిలౌటస్‌కు ప్రసిద్ధి. అలాగే పశ్చిమ కనుమలు 3 జాతుల వైవిధ్యానికి ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు తూర్పు కనుమల్లో ఇలాంటివే బయటపడ్డాయి. అయితే, తూర్పు కనుమలు భారీ అటవీ పర్వతాలు, జీవవైవిధ్యానికి ప్రసిద్ధి. భవిష్యత్లో కూడా తూర్పు కనుమల్లో మరింత జీవజాలం, ప్రత్యేకించి అరుదైన కప్ప జాతులు ఉండే అవకాశం ఉందని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉండగా, ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి నీరు, సముద్రపు నీరు, మురుగు నీటిలో ఉండే జీవజాతులపై పరిశోధన, అధ్యయనం చేస్తోంది. వీరు సూక్ష్మ జీవుల నుంచి జంతువుల వరకు కేటగిరీల వారీగా సంరక్షణ చర్యలు విధి విధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా మంత్రిత్వ శాఖలు, సంస్థలకు సిఫారసు చేస్తుంటారు.
అంతేగాక వీరు సేకరించే కోతులు, సర్పాలు, తాబేళ్లు, చేపలు, పిల్లులు, నెమళ్లు, ఎలుకలు, కప్పలు ఇలా అనేక జాతులను మ్యూజియంలో భద్రపరించి ప్రజలకు ప్రత్యేకించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. జాతుల సంరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన, వాయు, జల కాలుష్యాల తగ్గింపుపై కూడా ఈ సంస్థ అవగాహన కల్పిస్తుంది. అందుకే పర్యావరణ, జీవవైవిధ్యహితం దృష్ట్యా బంగారం కంటే అత్యంత విలువైన ప్రకృతి వనరులు సంరక్షించుకోవాల్సిన అసవరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 7000 కప్ప జాతులు : ప్రపంచంలో దాదాపు 7,000ల కప్ప జాతులు ఉన్నాయి. భారత్‌లో ఉన్న బుర్రోవింగ్ ఫ్రాగ్, గ్రీన్ ఫ్రాగ్, బుల్ ఫ్రాగ్, పెయింటెడ్ ఫ్రాగ్, ఏషియన్ కామన్ తోడ్, నేరో మౌత్‌డు ఫ్రాగ్ వంటి కప్పలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి ఆవాసాల విధ్వంసం, మారుతున్న వాతావరణం కారణంగా అవి వేగంగా కనుమరుగవుతున్నాయి. ఇంకా దేశంలో దాదాపు 100 కప్ప జాతులు గుర్తించకుండా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో చాలా జాతులు ఆవిష్కరణకు ముందే తుడిచిపెట్టుకుపోయాయని అంటున్నారు.
భారత ఉప ఖండంలో ఇప్పటి దాకా 19 రకాల గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్స్ గుర్తించారని పరిశోధకులు తెలిపారు. ఈ కప్పలు ప్రధానంగా చిత్తడి నేలలు, వ్యవసాయ భూమి, గడ్డి భూముల్లో కనిపిస్తాయంటున్నారు. ఇప్పుడు కనిపెట్టిన ఈ కప్పలు కూడా తూర్పు కనుమల్లో బయటపడ్డాయి. అంటే పర్యావరణ వ్యవస్థ ఎక్కడ బాగుంటుందో అక్కడ మాత్రమే ఈ కప్పలు మనుగడ సాగిస్తాయి,లేదంటే ఇవి కూడా అంతరించిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి, పర్యావరణ పరిరక్షణకు ఇప్పటికైనా నడుం బిగించి జీవజాలాన్ని పరిరక్షించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.
కవ్వాల్ అటవీ ప్రాంతంలో అరుదైన కప్ప - దాని పేరు, విశేషాలేంటో తెలుసా?