Ramoji Rao Funeral on Sunday at Film City : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఇవాళ (జూన్ 9వ తేదీన) నిర్వహించనున్నారు. ఫిల్మ్‌సిటీలో ఈరోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు జరపనున్నారు. రాష్ట్ర సర్కార్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌ను ఆదేశించారు.
మరోవైపు రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిల్మ్‌సిటీకి చేరుకుని నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని గుర్తుచేసుకొని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే సొంతమన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, రామోజీ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
టాలీవుడ్ కీలక నిర్ణయం - ఆదివారం సినిమా షూటింగ్స్ బంద్ : ఈనాడు అధినేత రామోజీరావు అస్తమయంపై తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు అన్ని సినిమాల షూటింగ్స్‌కు బంద్ చేయాలని నిశ్చయించింది. దివికేగిన మహనీయుడు రామోజీరావుకు నివాళిగా ఆదివారం సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటిస్తూ, టాలీవుడ్ సంతాపం తెలిపింది. సంతాప సూచికంగా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ సెలవు ప్రకటించారు.
మరోవైపు రామోజీరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని, పలువురు సినీ పెద్దలు కంటతడిపెడుతూ, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, నటులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియాజేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపారు.
అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు - రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం - Ramoji Rao Passes Away
రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao biography