Ramoji Rao Services to Telugu Media : రామోజీరావు పేరు వింటేనే తెలుగు వారందరికీ ఒక స్ఫూర్తి . తెలుగు వారికీ, తెలుగు నేలకీ ఆయన చేసిన సేవ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. తెలుగు పత్రికారంగంలో గ్రాంథిక వాసనల్ని తుదకంటా తుడిచి పెట్టి ప్రజల భాషకి పట్టం కట్టింది ఈనాడే. అచ్చ తెలుగు పదాలు, నుడికారాలు, తీరైన వాక్యాలు ఈనాడు భాషాసిరులు. శీర్షిక ఆకర్షణీయంగా ఉండి పాఠకుణ్ని వార్తలోకి లాక్కెళ్లాలనేది రామోజీరావు ధోరణి. 'తెలుగుదేశం సూపర్‌హిట్' 'జనమా బంతిపూల వనమా!', 'హితులారా ఇక సెలవు', 'చేసింది చాలు గద్దెదిగు లాలు', 'మామూళ్లు ఇవ్వకుంటే నూరేళ్లు నిండినట్లే' వంటి ఈనాడు తరహా శీర్షికలు అలాంటివే.
తెలుగు భాష పూర్తిగా ఆంగ్లమయం అవుతున్న తీరు రామోజీరావును కలిచివేసేది. తను ప్రాణ సమానంగా భావించే ఈనాడులో ఆంగ్లాన్ని పూర్తిగా పరిహరించాలని కంకణం కట్టుకున్నారు. పత్రికలోనూ, ఈటీవీ వార్తల్లోనూ ఆంగ్ల పదాలు దొర్లకుండా కట్టడిచేశారు. ఈ క్రమంలో వందల కొద్దీ తెలుగు పదాలు పురుడుపోసుకున్నాయి. సంపాదక బృందంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పద
సృష్టికర్త అయ్యారు. దస్త్రం (ఫైల్), బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), గుత్తేదారు (కాంట్రాక్టర్), మేఘమథనం (క్లౌడ్ సీడింగ్), శతకం (సెంచరీ) వంటి పదాలు, ఐకాస (జె.ఎ.సి.), అనిశా (ఎ.సి.బి.), తెదేపా (టి.డి.పి.), తెరాస (టి.ఆర్.ఎస్.), తితిదే (టి.టి.డి.) వంటి సంక్షిప్త రూపాలు చాలావరకు ఈనాడు, ఈటీవీల్లో పుట్టినవే. కాదంటే ఈనాడు, ఈటీవీల ద్వారా బహుళ ప్రచారంలోకి వచ్చినవే. బల్దియా (మున్సిపల్ కార్పొరేషన్), లష్కర్ (సికింద్రాబాద్), గల్లీ (వీధి), ముక్కాలు (ముప్పావు) వంటి మాండలిక పదాల్ని కూడా ఈనాడు, ఈటీవీలు ప్రాచుర్యంలోకి తెచ్చాయి.
ఈ కృషికి కొనసాగింపుగా ఆవిర్భవించిందే రామోజీ ఫౌండేషన్. భాషా సేవకులు, ప్రేమికులు, అభిమానుల ఆకాంక్షల్ని ఒక చోటకు చేర్చి తెలుగు భాషకి వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో 2012లో రామోజీరావు తెలుగు వెలుగు ప్రారంభించారు. తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో, అంత అధునాతన లక్షణాలు కలిగిందని ఆయన నమ్ముతారు. ఎలాంటి భావాల్ని అయినా వెలిబుచ్చడానికి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచడానికి, సంగీత సాహిత్యాల్ని సృజించడానికి తెలుగు ఎంతో అనుకూలమైనా, తెలుగు మాధ్యమంలో చదువులు సాగకపోవడం వల్లే తెలుగు జాతికి ఈ దురవస్థ అంటారు. ఆయన దృష్టిలో మాతృభాషని మరచిపోయిన జాతికి మనుగడ లేదు. తెలుగు భాష అంటే అభిమానంతోనే తన రెండో కుమారుడు సుమన్‌కి కొండవీటి వెంకటకవి గారితో ఏడేళ్లపాటు శిక్షణ ఇప్పించారు. మనవరాళ్లు, మనవడితో తెలుగులోనే మాట్లాడతారు. ఒక్క ఆంగ్లపదం దొర్లకుండా తెలుగులో మాట్లాడాలని వారితో పోటీ పెట్టుకోవడం ఆయనకు అలవాటు.
హైదరాబాదులో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం కావడం తెలుగు వారికి ఎంతో ప్రాచుర్యాన్నీ, గుర్తింపునీ తెచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్ నమోదైంది. దేశంలో అన్ని భాషల సినిమాలూ ఇందులో నిర్మాణమవుతున్నాయి. ఇక్కడికి రాని భారతీయ సినిమా ప్రముఖులు లేరు. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ ఛానళ్లను తెలుగునేలపై ఆవిష్కరించడం భాగ్యనగరానికీ ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులు, సృజనశీలురు, రచయితలు వీటిలో పనిచేయడానికి హైదరాబాదు వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో 13 భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్ భవనం ఒక మినీ పార్లమెంట్లాగా ఉంటుంది. వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, ఉప్పల్ వీధుల్లో ఇంతమంది ఇతర భాషల వారు నివాసం ఉండటం ఆయన స్థాపించిన సంస్థల ఫలితమే.
తెలుగు పత్రికారంగంలో చెరగని ముద్ర వేసిన రామోజీరావు - Ramoji Rao Services to Telugu Media
రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు. అన్నింటిలోకి జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైనది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు. వర్తమాన వ్యవహారాల్ని ఆయన నిశితంగా పరిశీలిస్తారు. తెలుగు నుడి, పద ప్రయోగం, వాక్యనిర్మాణంపై ఆయనకు పట్టు ఎక్కువ. చెప్పాల్సిన విషయం అక్షరాల్లో నూరుశాతం ప్రతిబింబించేంత వరకు ఆయన పట్టు విడవరు. సంపాదకుడు అంటే ఆయనే. న్యూస్ ప్లానింగ్, న్యూస్ జడ్జిమెంట్ రామోజీరావు నుంచే నేర్చుకోవాలి. ఈనాడు ఇన్ని విజయ శిఖరాలు చేరడానికి తనలోని పాత్రికేయుడే ప్రధాన కారణం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా రామోజీరావు పనిచేశారు. ఆ పదవికి అందరికన్నా ఆయనే ఎక్కువ అర్హులు.
1989లో ఈనాడు జిల్లా పత్రికల ఆవిష్కరణ రామోజీరావు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఇవి స్థానిక వార్తలకు పట్టంగట్టి తెలుగునాట జర్నలిజం రూపురేఖల్ని మార్చివేశాయి. సామాన్యుల ఆకాంక్షలకు అద్దం పట్టాయి. పాలనలో పారదర్శకతకు తలుపులు తెరిచాయి. జిల్లా పత్రికల వల్ల కొత్త తరం నాయకులు ప్రాచుర్యంలోకి వచ్చారు. అనుకరణే అత్యుత్తమ ప్రశంస అన్నట్లుగా దేశంలోని దాదాపు అన్ని భాషల పత్రికలూ కాలక్రమంలో ఇదే పందాను అనుసరించడం ఆయన ముందుచూపునకు తార్కారణం.
రామోజీరావు సంపాదకత్వంలో నడిచిన 'అన్నదాత' దేశంలోనే అగ్రగామి వ్యవసాయ మాసపత్రిక ఖ్యాతి పొందింది. 1969లో దీనిని ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన మొదటి పత్రిక ఇదే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు రైతులంటే ఎంతో అభిమానం. అన్నదాతల మేలుకోసం ఈనాడు దినపత్రికలో సైతం 'రైతేరాజు' శీర్షికని ప్రవేశపెట్టారు. ఈ వ్యాసాల్ని రైతులు మాట్లాడుకునే భాషలో ఇవ్వడం వల్ల వారి ఆదరణకు పాత్రమైంది.
మీడియా రంగంలో తెలుగు కీర్తి పతాక రామోజీరావు - ramoji rao success in MEDIA field
రామోజీరావుది మొదటి నుంచీ వినూత్న శైలి. 1978లోనే 'విపుల, చతుర' సాహిత్య పత్రికల్ని ప్రారంభించడం ఇందుకొక ఉదాహరణ. ప్రపంచ భాషల్లోని అత్యుత్తమ కథల్ని అనువదించి తెలుగు వారికి అందించడానికి ఆయన 'విపుల' పత్రిక తెచ్చారు.. ఇలాంటి ప్రయత్నం, ప్రయోగం అంతకుముందెన్నడూ, ఎక్కడా లేదు. ఉత్తమ సాహిత్యాన్ని నెలనెలా నవల రూపంలో, చౌకగా పాఠకులకు అందించాలనే ఆలోచనతో మొదలైంది 'చతుర' పత్రిక, ఇదీ ఒక విభిన్న ఆలోచనే.
రామోజీరావు నిర్మించిన సినిమాలూ చరిత్ర సృష్టించాయి. బడ్జెట్ వేలంవెర్రిలో కొట్టుకుపోకుండా తక్కువ ఖర్చుతో సినిమాలు నిర్మించడం ఆయనకు అలవాటు. జన సామాన్యంలో జరిగే సంఘటల్నే కథావస్తువులుగా స్వీకరించారు. మౌనపోరాటం, ప్రతిఘటన, మయూరి, పీపుల్స్ ఎన్ కౌంటర్, అశ్విని సినిమాలు అలాంటివే. ఇవన్నీ మంచి సినిమాలుగా గుర్తింపు పొందడమే కాక, ఆర్ధికంగా గొప్ప విజయాలు సాధించాయి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమాల ద్వారా ఎంతోమంది నటీనటులు, దర్శకులు వెండితెరకు పరిచయమయ్యారు. జైపూర్ చెక్క కాలితో నాట్యం చేసే సుదాచంద్రాన్ని, పరుగుల రాణి అశ్వని నాచప్పని కథానాయికలుగా, కీరవాణిని, ఎస్. జానకిని సంగీత దర్శకులుగా, జూనియర్ ఎన్టీఆర్, శ్రియ లాంటి ఎంతో మందిని తారలుగా మలచిన ఘనత ఆయనదే.
గృహిణులు పెట్టుకునే పచ్చళ్లని పరిశ్రమగా ప్రారంభించి, కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లినా, పరస్పర విశ్వాసమే ఆలంబనగా నడిచే చిట్ఫండ్ వ్యాపారంతో వేల కోట్ల టర్నోవర్ సాధించినా ఆయన దూరదృష్టి, కార్యదీక్షలే కారణాలు . ఆయనది సవాళ్లని అవకాశాలుగా మార్చుకొనే స్వభావం. సవాళ్లు లేని జీవితం ఆయనకు నిస్సారం.
రామోజీరావు తమ సంస్థల్లోని నియమనిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. ప్రజలకు సంబంధించిన సమాచారమే వార్తాంశం కావాలని ఆయన నియమం. తన మాతృమూర్తి మరణం కూడా ఈనాడులో వార్తగా రావడానికి అంగీకరించలేదు. ఇతర పత్రికల ద్వారానే ఆ వార్త లోకానికి తెలిసింది. 1962లో ప్రారంభించిన మార్గదర్శి చిట్ఫండ్స్ హామీ పత్రం ఇవ్వకుండా డబ్బు చెల్లించండని ఇంతవరకు ఒక్కరికీ సిఫారసు చేయలేదంటే ఆయన పద్ధతుల్ని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. రామోజీ గ్రూపులో దశాబ్దాలుగా నెలాఖరు రోజునే విధిగా జీతాలివ్వడం, పదవీ విరమణ రోజునే సంస్థాగతమైన చెల్లింపులు చేయడం ఆయన పట్ల నమ్మకాన్ని పెంచాయి. ఏ సంస్థ మనుగడకైనా ఇలాంటి ప్రమాణాలే శ్రీరామరక్ష.
రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు రామోజీరావును చక్రబంధంలో ఇరికించాలని చూసినప్పుడు లక్షల మంది ప్రజలే రక్షాకవచమై నిలిచారు. జనానికి ఏమాత్రం అనుమానం కలిగినా ప్రభుత్వరంగ సంస్థలే మనుగడ సాగించలేవు. ప్రభుత్వ పెద్దలే అపోహల్ని, పుకార్లని సృష్టించి, ఆందోళనలను ఎగదోసినప్పుడు ప్రజలు ఆయన పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండటం భారతదేశ చరిత్రలోనే అద్వితీయం. మార్గదర్శి ఉదంతం విశ్వసనీయతకి గొప్ప ఉదాహరణ. రామోజీరావు జీవితంలో శిఖర సమానమైనది 1984 నాటి ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం. తెలుగుదేశం పార్టీని నిలువునా చీల్చి ఏడాదిన్నర ప్రాయంలోనే ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు ఈనాడు దినపత్రిక విశ్వరూపం చూపింది. తెలుగునాడు యావత్తూ భగ్గుమంది. దేశం మొత్తానికి నెల రోజుల పాటు ఈ అంశమే కేంద్ర బిందువు అయింది. రాజకీయ పక్షాలకు, మేధావులకు, న్యాయకోవిదులకు ఇదే వార్తాంశం. శక్తిమంతురాలైన నాటి ప్రధాని ఇందిరాగాంధీ నెల రోజులు తిరక్కుండానే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పునః ప్రతిష్ఠించవలసి వచ్చింది. దేశంలోనే అదొక అపూర్వ ఘట్టం. అలాగే జగన్మోహనరెడ్డి అరాచకపాలనపై ప్రజాపక్షాన సాగించిన అవిశ్రాంత పోరాటం రామోజీరావును శిఖరాగ్రాన నిలిపింది.
ఈనాడు సహాయ నిధి ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి దేశవ్యాప్తంగా ఎన్నో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఇళ్లు, బడులు, తుపాను రక్షిత భవనాలు నిర్మించారు. శ్రమదానోద్యమం, సుజలాం-సుఫలాం ద్వారా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. రామోజీ సేవలకు ఎన్నో పురస్కారాలు లభించాయి.
ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లతో గౌరవించాయి. ప్రతిష్టాత్మక యుద్్వర్, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదురి (రాజస్థాన్) బి.డి. గోయంకా వంటి అనేక అవార్డులు లభించాయి. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ను రామోజీరావు అందుకున్నారు. లక్ష్యం, ప్రగతి ప్రస్థానం ఎప్పుడూ, ఎక్కడా అగకూడదన్నది రామోజీరావు భావన.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం - RAMOJI RAO passed away