Ramoji Foundation Adopted Naganpally Village : అనుక్షణం ప్రజాహితం రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు అభిమతం. ఓవైపు అక్షరాలే అస్త్రాలుగా ప్రజాచైతన్యానికి కృషి చేసిన ఆయన జనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అందించడంలో ముందుండేవారు. మరోవైపు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్‌లోని పెదపారుపూడి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లిని రామోజీ గ్రూప్ దత్తత తీసుకోవడం ఆ పల్లెల రూపురేఖల్నే మార్చేసింది. రోడ్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అధునాతన వసతుల కల్పన ద్వారా ఆయా గ్రామస్థుల జీవనశైలిని మెరుగుపరిచింది.
Ramoji Foundation Social Service : నాగన్‌పల్లి గ్రామంలో రామోజీ ఫౌండేషన్ కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. రూ.6.5 కోట్లతో 3 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కట్టించారు. రూ.కోటికి పైగా వ్యయంతో గ్రామపంచాయతీ భవనం, రూ.25 లక్షలతో ఆర్‌ఓ ప్లాంట్, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ- మహిళ సంఘాలకు భవనాలు, రచ్చబండ, ఆరోగ్య కేంద్రం, అన్ని వర్గాలకు కమ్యూనిటీ భవనాలు, వంద శాతం భూగర్భ మురుగు కాలువలు, బస్‌షెల్టర్లు, చెట్ల పెంపకం, 3 వైకుంఠధామాలు నిర్మించారు.
Ramoji Rao Passed Away in HYderabad : పాడి రైతుల కోసం రూ.3 కోట్లతో డెయిరీ ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామంలో అర్హులైన మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించారు. అదేవిధంగా ఏపీలోని కర్నూల్ జిల్లాలో నిర్మించిన అనాథాశ్రమం, తెలంగాణలోని అబ్దుల్లాపుర్‌మెట్‌లో కట్టించిన పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం రామోజీ గ్రూప్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు తాజా ఉదాహరణలు.
రామోజీ ఫౌండేషన్ సేవలు భేష్ : మరోవైపు నాగన్‌పల్లి గ్రామంలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్పించిన మౌలిక వసతులు, సేవా కార్యక్రమాలను మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 40 మంది ప్రొఫెసర్ల బృందం, నీతి ఆయోగ్ ప్రతినిధులు పరిశీలించారు. ఫౌండేషన్ చేపట్టిన పనులు ప్రశంసనీయమని వారు అన్నారు.
రామోజీరావు మరణ వార్త తెలుసుకుని నాగన్‌పల్లి గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తమను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. రామోజీ ఫౌండేషన్ చేసిన అభివృద్ధి పనులతో తమ బతుకులు బాగుపడ్డాయని అన్నారు. రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
Ramoji foundation: దత్తత గ్రామంలో రూ.14.23కోట్లతో అభివృద్ధి పనులు