RAJYA SABHA BY ELECTION SCHEDULE : ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. మొత్తం 4 రాష్ట్రాల్లోని 6 ఖాళీలకు ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీఐ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.
ఏపీ, ఒడిశా, బంగాల్, హరియాణా రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఉపఎన్నికలకు డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10వ తేదీ తుదిగడువుగా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించింది. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 13 తుదిగడువుగా తెలిపారు. డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం షెడ్యూల్లో పేర్కొంది. అదేరోజు ఓట్లను లెక్కిస్తారు.
Mopidevi Venkataramana and Beeda Masthan Rao: కాగా అధికారం కోల్పోయిన తరువాత వైఎస్సార్సీపీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక రాజ్యసభ పదవికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఈ మేరకు ఇద్దరి రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆగస్టు 29వ తేదీన ఆమోదించారు. అనంతరం వీరిద్దరూ టీడీపీలో చేరారు.
Krishnaiah Resignation: వీరిబాటలోనే ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సెప్టెంబర్ 23వ తేదీన రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ సెప్టెంబర్ 24వ తేదీన ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్టు ఆ సమయంలో ఆర్.కృష్ణయ్య తెలిపారు. తాజాగా వీరి రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలోని సీట్లకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది.
యూపీ ఉపఎన్నికలు- నియమావళి ఉల్లంఘించిన ఐదుగురు పోలీసులపై ఈసీ వేటు