Rajendra Nagar SOT police Arrested Fake Cigarettes Gang : డిటర్జెంట్ పౌడర్ ముసుగులో రాష్ట్రానికి నకిలీ సిగరెట్స్ తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠా గుట్టును రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. బిహార్ రాజధాని పట్నా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా గగన్ పహాడ్ పార్కింగ్ వద్ద పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. రూ.2 కోట్ల విలువ చేసే నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విదేశీ కంపెనీకి సంబంధించిన ప్యాకింగ్ కవర్‌ను తయారుచేసి, అందులో నకిలీ సిగరెట్లు పెట్టి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
జీపీఎస్‌తో లొకేషన్ ట్రాకింగ్ : హైదరాబాద్‌లో ముషీరాబాద్‌లోని శ్రీరామ ఎంటర్ప్రైజెస్ పేరు మీద డెలివరీ అడ్రెస్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదంతా రెహాన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సిగరెట్లు స్మగ్లింగ్ చేస్తున్న కంటైనర్‌కు ఎవరికీ తెలియకుండా నిందితుడు జీపీఎస్(GPS) అమర్చినట్లు గుర్తించారు. ఎంత కాలం నుంచి ఈ దందా జరుగుతుందనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
బిహార్‌కు చెందిన రవికాంత్ కుమార్, హరియాణాకు చెందిన మహ్మద్ షెహజాద్, ముబారిక్ ఖాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఇలియాసుద్దీన్, రెహాన్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గయాకు చెందిన సుభాశ్ మెటీరియల్ సరఫరా చేస్తున్నాడని, అతడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Fake Essential Products in Hyderabad : ఇదికాగా మరోవైపు ఫిబ్రవరిలో కూడా ప్రముఖ కంపెనీలకు చెందిన నిత్యావసరాల నకిలీ వస్తువులు తయారీ చేసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్, బిహార్‌కు చెందిన నిందితులు ప్రముఖ కంపెనీలకు చెందిన వస్తువులను నకిలీగా తయారు చేసి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అమ్ముతూ దొరికిపోయారు. కంపెనీలు ఇచ్చిన ధర కంటే తక్కువ ధరకు ఉండటంతో ఎక్కువ లాభాలు వస్తుందని భావించిన డిస్ట్రిబ్యూటర్స్ వీటిని కిరాణా షాపుల్లో అమ్మకాలు చేశారు.
సామాన్య జనాలు గుర్తు పట్టలేనంతగా ఉండటంతో రెండేళ్లుగా నకిలీ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కా సమాచారంతో రావడంతో వీటిని తయారు చేస్తున్న నాగారం, కాటేదాన్‌లో ఉన్న తయారీ కేంద్రాలపై సోదాలు జరిపి నకిలీ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను సీజ్ చేశారు. టీ పౌడర్స్(Tea Powder), వాషింగ్ పౌడర్స్, వాషింగ్ సోప్స్, హెయిర్ ఆయిల్స్ ఇలా నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
బ్రాండెడ్ వస్తువులకు ఏమాత్రం తీసిపోవు - మీరు కొనే వస్తువులు 'నకిలీ'వేమో ఓసారి చెక్ చేసుకోండి